Gold Price : ధన్‌తేరాస్ వేళ బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న పుత్తడి రేటు… అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా పెరగడంతో… ఆ ప్రభావం మన దగ్గరా పడింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.830 పెరిగి రూ.51,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి… రూ.47 వేలకు చేరింది.
అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్… వడ్డీరేట్లను వచ్చే డిసెంబర్లో తక్కువగా పెంచాలని భావిస్తున్నట్లు వార్తలు రావడంతో… బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఔన్సు గోల్డ్ రేట్ 26 డాలర్ల దాకా పెరిగి… 1662 డాలర్లకు చేరింది. అందుకే మన దేశంలోనూ బంగారం ధరలు పెరిగాయి.
ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి 1700 రూపాయలు పెరిగి… రూ.63,200 దగ్గర నిలిచింది. బంగారం ధరలు ఎంత ఎగసినా… ధన్‌తేరాస్ రోజు అమ్మకాలు భారీగా ఉంటాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈ ఒక్కరోజే దాదాపు 40 వేల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.