Madhapur: మాదాపూర్ సిద్ధిక్ నగర్ లో ఐదు అంతస్థుల భవనం కూరుకుపోయి పక్కకు ఒరిగింది. భవన నిర్మాణం సెల్లార్ కోసం పెద్ద గుంత తీయడంతో పక్కనే ఉన్న ఐదు అంతస్థుల పెద్ద భవనం ఒక పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కిందపడిపోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని భవనం కూల్చివేతకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. చుట్టుపక్కల ఉన్న ఇండ్లను ఖాళీ చేస్తున్నారు.
Also read: సత్యం ఇంట్లో పండుగ సంబరాలు.. రవికి ఫోన్ చేసిన షీలా.. నిజం తెలిసిపోయిందా..?
సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్ తీయడం వల్లనే బిల్డింగ్ పక్కకు ఒరిగిందని షేర్ లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ తెలిపారు. అనుమతులు లేకుండా 60 గజాల్లో బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. అంతే కాకుండా బిల్డర్ సహాయంతో కాకుండా కేవలం మేస్త్రీలతో ఈ భవనాన్ని నిర్మించినట్టు తెలుస్తోందన్నారు. ఇప్పటికే యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకున్న తరవాత బిల్డింగ్ కూల్చివేయాలా లేదా అని ఆలోచిస్తామని తెలిపారు.
ఒకవేళ భవనం కూల్చివేస్తే పక్కన ఉన్న బిల్డింగ్ లకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు సెల్లార్ కోసం తవ్విన భవన నిర్మాణానికి హైడ్రా అనుమతి తీసుకున్నారా లేదా అన్నదానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. బిల్డింగ్ కూల్చివేయాలా? లేదా అనేదాని కోసం కూడా హైడ్రా అధికారుల సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ఇటీవల హైడ్రా అక్రమ నిర్మాణానాలను భారీగా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవనాన్ని కూల్చివేస్తే హైడ్రా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.