Kiran Kumar Reddy on Kavitha: నీచమైన రాజకీయాల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. నీచమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారో.. యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసునని ఆయనన్నారు.
కల్వకుంట్ల ఫ్యామిలీ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ లిక్కర్ సామ్రాజ్య కేసులు రోజుకొకటి బయటపడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీలోనే బయటపడిన కల్వకుంట్ల బాగోతం ఇప్పుడు కేరళలో కూడా మూలాలు బయటపడుతున్నాయని అన్నారు. కవిత లిక్కర్ దందాలు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో బయటపడుతూనే ఉన్నాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా.. ముఖ్యమంత్రి రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ చేసినంత అన్యాయం తెలంగాణకు ఇంకెవరూ చేయలేదని అన్నారు. ‘శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 40 వేల క్యూసెక్కుల నుంచి 90 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం పెరిగింది మీ హయాంలోనే. అంతేకాదు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడం కోసం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నే వాయిదా వేసిన ఘనత మీ నాన్న కేసీఆర్‌దే’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
‘రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పింది మీ నాన్న కాదా..? ఏ విధంగా చూసినా కృష్ణా నీటిలో దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్ కాదా..? ఇక గోదావరి విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గోదావరి మీద కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే మునిగిపోయింది. రూ.లక్ష కోట్లు పెట్టి ఖర్చు చేసి గోదావరి నీటి పాలు చేశారు. ఇలా నీళ్ల విషయంలో తీవ్రంగా అన్యాయం చేసింది మీ నాన్న కేసీఆర్ కాదా..?’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: KCR: తులం బంగారానికి ఆశపడి ఓటేశారు.. జనాలను కించపరిస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు..?
అయితే.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ నీళ్లు- నిజాలుపై ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. నీళ్ల మీద రేవంత్ సర్కార్ నీచమైన రాజకీయం చేస్తోందని.. నీళ్లపై అబద్ధాలు చెప్పడం మానేసి నిజాలు మాత్రమే చెప్పాలని ఆమె ఫైరయ్యారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలిన చిన్న ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ పూర్తి చేయాలని సవాల్ విసిరారు. సీఎం సొంత జిల్లాలో పంటలను ఎండగొట్టారని.. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల స్కీం పనులను దాదాపు పూర్తి చేశామని అన్నారు. రేవంత్ సర్కార్ దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్ట్ ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాజీ సీఎం కేసీఆర్ నిర్మించారని.. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.