ట్విట్టర్ ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమంటూ ఇప్పటికే 8 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన ఎలాన్ మస్క్… తనను బహిరంగంగా ప్రశ్నించే ఉద్యోగుల్ని కూడా ఇంటికి సాగనంపుతున్నాడు. నాతో పెట్టుకోకండి… పెట్టుకుంటే మటాషే… అనే సందేశాన్ని మరోసారి ఉద్యోగులందరికీ పంపాడు… ట్విట్టర్ కొత్త బాస్ మస్క్.
ట్విట్టర్ నుంచి ఉన్నఫళంగా ఇద్దరు ఉద్యోగుల్ని పీకేశాడు… మస్క్. కారణం… ట్విట్టర్ వేదికగా వాళ్లిద్దరూ ఆయన్ని ప్రశ్నించడం, తప్పుబట్టడమే. దాంతో… మీకు నచ్చకపోయినా, సంస్థ బాగు కోసం సూచనలు చేసిన వారిని ఇలా తీసేసుకుంటూపోతే… చివరికి ట్విట్టర్లో ఎవరూ మిగలరని ఇప్పుడు అంతా మస్క్‌కు కౌంటర్ ఇస్తున్నారు.
మస్క్ తీసేసిన ఉద్యోగుల్లో ఒకరు ఎరిక్ ఫ్రోన్‌హోఫర్. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ట్విటర్ యాప్‌పై పనిచేసిన ఆయన… గతంలో మస్క్ చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు. ట్విటర్ యాప్ సాంకేతికపరమైన అంశాన్ని మస్క్ అర్థం చేసుకుంటున్న తీరు తప్పు అని కామెంట్ యాడ్ చేశారు. దీనికి స్పందించిన మస్క్… ఎలాగో వివరించాలని కోరుతూనే… ఆండ్రాయిడ్‌లో చాలా స్లోగా పనిచేస్తున్న ట్విట్టర్ సమస్యను పరిష్కరించడానికి ఏం చేశారో ముందుగా చెప్పండి అంటూ ట్విటర్ వేదికగానే ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఎరిక్ కొన్ని ట్వీట్లు చేశారు. మధ్యలో కలగజేసుకున్న ఓ యూజర్… మీ అభిప్రాయాన్ని మస్క్‌తో వ్యక్తిగతంగా ఎందుకు పంచుకోలేదు? అని ఎరిక్ ను ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన ఎరిక్… మస్క్ కూడా మెయిల్ లేదా స్లాక్ ద్వారా వ్యక్తిగతంగా ప్రశ్నలు అడిగి ఉంటే బాగుండేదని అన్నాడు. అక్కడితో వాదనలకు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటే… ఎరిక్‌ను కంపెనీ నుంచి తీసేస్తున్నట్లు ట్వీట్ చేసి… మస్క్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇక మస్క్ తీసేసిన మరో ఉద్యోగి పేరు బెన్ లీబ్. ఆయన కూడా గతంలో మస్క్ చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ… ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని బలంగా చెప్పగలను అని కామెంట్ చేశారు. అంతే… అతని ఉద్యోగాన్ని కూడా పీకేశాడు… మస్క్. దాంతో… 10 ఏళ్లుగా ట్విట్టర్లో పనిచేస్తున్న తనను మస్క్ ఉన్నఫళంగా తీసేశాడని వాపోయాడు… బెన్ లీబ్.