అంతర్జాతీయ టోర్నీల్లో అదరగొట్టిన తెలంగాణ అమ్మాయిలు ఆకుల శ్రీజ, నిఖత్ జరీన్… అర్జున అవార్డులు సాధించారు. మొత్తం 25 మంది అర్జున అవార్డుకు ఎంపికైతే… వాళ్లలో ఈ ఇద్దరే తెలుగు క్రీడాకారిణులు. దాంతో… శ్రీజ, నిఖత్‌లపై ప్రసంశల జల్లు కురుస్తోంది.
బాక్సింగ్ లో నిఖత్ తిరుగులేని పంచ్ లు విసురుతుంటే… టేబుల్ టెన్నిస్ లో శ్రీజ అద్భుతంగా రాణిస్తోంది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్‌లో కాంస్య పతకంతో మెరిసింది. ఇక ఆకుల శ్రీజ కెరీర్ ఈ ఏడాది పీక్స్ లో ఉంది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడిన శ్రీజ… గోల్డ్ మెడల్ కొట్టింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో శ్రీజ మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు సాధించింది. దాంతో నిఖత్, శ్రీజలను అర్జున అవార్డుకు ఎంపిక చేసింది… కేంద్రం.
ఇక, దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు ఈసారి ఒక్కరికే దక్కింది. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల టేబుల్ టెన్ని స్ ప్లేయర్ శరత్ కమల్‌ను ఈ ఏడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు వరించింది. ఏకంగా నాలుగు ఒలింపిక్స్‌ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు… శరత్ కమల్. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌ల్లో ఆడాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన శరత్… ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్నాడు. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో… విజేతలందరికీ అవార్డులు ప్రదానం చేయనున్నారు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.