New Records in Stock Markets : భారత స్టాక్ మార్కెట్లు రోజురోజుకూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ… కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవాళ 62,887 పాయింట్లకు చేరి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్… చివరికి 177 పాయింట్ల లాభంతో… 62,682 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 18,678 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకి… చివరికి 55 పాయింట్ల లాభంతో 18,618 పాయింట్ల దగ్గర క్లోజైంది.
గత రెండు సెషన్‌లుగా రికార్డుల మోత మోగిస్తున్న సూచీలు… అదే జోష్‌తో వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 62,505 పాయింట్ల దగ్గర ముగిసిన సెన్సెక్స్… ఉదయం 143 పాయింట్ల నష్టంతో 62,362 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. అయితే కాసేపటికే నష్టాల్ని పూడ్చుకుని లాభాల్లోకి మళ్లిన సెన్సెక్స్… ఇక ఏ దశలోనూ వెనుదిరిగి చూసుకోలేదు. కొనుగోళ్ల జోరుతో ఒకస్థాయిలో 62,887 పాయంట్ల ఆల్ టైమ్ గరిష్టస్థాయిని తాకింది. మొత్తమ్మీద 525 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్… చివరికి 177 పాయింట్ల లాభంతో 62,682 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ కూడా 126 పాయింట్ల మధ్య చలించి… చివరికి 55 పాయింట్ల లాభంతో 18,618 పాయింట్ల దగ్గర స్థిరపడింది.
ట్రేడింగ్ లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసిజి, మెటల్ రంగ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి.
హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరోమోటో, బ్రిటానియా, సిప్లా, నెస్లే, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన వాటిలో ఇండస్‌ఇండ్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. అటు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 81 రూపాయలా 67 పైసల దగ్గర ముగిసింది.