Night Diet : మన శరీర ఆరోగ్యానికి ఆహారం ఎంతో ముఖ్యం. మితంగా తింటే అమృతం, అదే అమితంగా తింటే విషం అంటున్నారు నిపుణులు, మరికొందరు అయితే ఎప్పుడు పడితే అప్పుడు కడుపులోకి అందినదంతా తోసేస్తుంటారు. సమయం, సందర్భం అస్సలు చూసుకోరు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం హరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహారాలను రాత్రి సమయంలో అసలు ముట్టుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండు.. దీనికి ఆమ్లాలను హరించే లక్షణం ఉంటుంది, గుండెల్లో మంటను తగ్గిస్తుంది. పగలు తింటే శక్తి వస్తుంది. అదే రాత్రి తింటే దగ్గు, జలుబుతో పాటు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పెరుగు అరుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది. పేగుల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే రాత్రి సమయంలో పెరుగుతింటే ఎసిడిటీని పెంచుతుంది. శ్వాసమార్గంపై చెడు ప్రభావం చూపుతుంది.
గ్రీన్ టీ.. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. కానీ దీన్ని పొరగడుపున తీసుకుంటే దానిలోని కెఫీన్ వల్ల డీహైడ్రేషన్, ఎసిడిటీలాంటి సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో సాధ్యమైనంత వరకు అన్నానికి దూరంగా ఉండాలి. అన్నంలో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. కడుపు ఉబ్బినట్టుగా మారుతుంది. నిద్ర కూడా సరిగా ఉండదు, దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పాలల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పగటిపూట ఎక్కువసార్లు తాగితే అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే జీర్ణం కావడానికి పాలు ఎక్కువ సమయం పడతాయి. అదే రాత్రిపూట తాగితే శరీరానికి ఎంతో విశ్రాంతిగా ఉంటుంది. రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. అదే పగటి పూట తింటే అరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. అలాగే రాత్రి పూట కాఫీ తాగితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కెఫీన్ వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు.