Pawan Kalyan React Pithapuram Issue: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరానగర్‌లో మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. పిఠాపురంలో నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి, మహిళ కాగితం చూపించి అడ్రస్ అడిగారని, ఆ తర్వాత బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్లారని చెబుతున్నారు.
అయితే మత్తు మందు చల్లి ఆ వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలోని ఆ బాలికను ఆటో ఎక్కిస్తుండగా చెత్త ఏరుకునే మహిళ చూడడంతో అసలు వ్యవహారం బయటపడింది. కాగా, ఆ వ్యక్తి మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు అని, ఆయనకు మరో మహిళ సహకరించినట్లుగా బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ మేరకు జాన్ బాబుతో పాటు మరో మహిళను పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
పిఠాపురంలో మైనర్ బాలికపై మాధవపురం డంపింగ్ యార్డు దగ్గర జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఈ అమానుష చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ దుస్సంఘటనపై తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని పవన్ కల్యాణ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
Also Read: పవన్ కళ్యాణ్‌పై కవిత రాసిన రోజా, బుద్ధి.. జ్ఞానం ఉంటే…
ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామమని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని చెప్పినట్లు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.