మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అన్నారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతో నడుస్తాయని చెప్పారు. 70శాతం మందికి ఎన్టీఆర్ వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థుల సీట్లూ పెరుగుతామని తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ఈ రైళ్లు వెళ్తాయని చెప్పింది. జనవరి 9 నుంచి 19 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామంలో ఓటు రిగ్గింగ్ కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి తన స్వగ్రామానికి ఓటు వేయడానికి వచ్చిన యాస్మిన్ అనే మహిళకు.. పోలింగ్ కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైంది. గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన యాస్మిన్‌కు, అప్పటికే ఆమె ఓటు పోలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఓటు వేయకుండానే ఆమె నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో జరుగుతున్నది అంతా అసత్య ప్రచారమని తెలిపింది. ఈ మేరకు వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్ అతికిరాతకంగా హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో లారీ డ్రైవర్ సల్మాన్‌ను మరో లారీలో ముగ్గురు దుండగులు వెంబడించారు. దేవి తండా వద్ద అడ్డుకొని ఇనుప రాడ్‌తో తలపై కొట్టి చంపారు. ఆపై అదే లారీలో చంద్రయాన్ పల్లి వరకు వెళ్లి ఓ దాబా వద్ద లారీని అపేసి అడవి ప్రాంతాల్లోకి పారిపోయారు.
మహిళా క్రికెటర్ శ్రీచరణికి మంత్రి నారా లోకేష్ నగదు ప్రోత్సాహకం అందజేశారు. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆమె అద్భుత ప్రదర్శన చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. ఉండవల్లిలోని నివాసంలో క్రికెటర్ శ్రీచరణిని లోకేష్ స్వయంగా కలిశారు.
మంచిర్యాల జిల్లాలో ఓ 115 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో తుది విడత పోలింగ్ సందర్భంగా భీమారం మండలంలో ఓటేసింది. దీంతో 115 ఏళ్ల సుందిల్ల పోసాన్.. ఓటర్లందరికి ఆదర్శంగా నిలిచారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్లు గొడవకు దిగారు. వివాదం కాస్త తోపులాటకు దారితీసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి మనవడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడంపై వస్తున్న విమర్శలను కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఖండించారు. మెస్సీ టూర్ కంప్లీట్‌గా ప్రైవేట్ ఈవెంట్ అని స్పష్టం చేశారు. మెస్సీ ఈవెంట్‌ను ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించలేదన్నారు. మెస్సీతో సీఎం మనవడు కలవడాన్ని చెడుగా చిత్రీకరించే దిక్కుమాలిన ఆలోచనలు మానుకోవాలంటూ ఘాటుగా సూచించారు.
మహబూబాబాద్ జిల్లా పోగుళ్లపల్లిలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈర్యతో పాటు.. నలుగురిపై దాడి చేశారు. ఇరు వర్గాల తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు.
కుమురం భీం జిల్లా రాస్పెల్లి గ్రామం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్ధి రాజయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. మిగిలిన అభ్యర్థులు డబ్బు బాగా పంచారని.. తన దగ్గర పంచడానికి అంత డబ్బు లేదు కాబట్టి ఓడిపోతాననే భయంతో రాజయ్య పురుగుల మందు తాగారు. రాజయ్యను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటింగ్ కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అనుచరుల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారనే అంశంపై ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కలకలం రేపింది. ఓటర్ల వేలిపై ఉన్న ఎన్నికల సిరాను తొలగిస్తున్న ఒక యువకుడిని ఇంటలిజెన్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ అనే యువకుడు.. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసి వచ్చిన మహిళలకు సిరా గుర్తు తొలగిస్తుండడాన్ని ఇంటలిజెన్స్ సిబ్బంది గమనించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకొని కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది తీవ్రమై రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు… రెండు వర్గాలను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇథియోపియా పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంట్‌లో భారత ప్రధాని మోదీ ప్రసగించారు. భారతదేశ 140 కోట్ల ప్రజల తరఫున వచ్చానని.. ఇక్కడ అడుగు పెట్టినప్పుడల్లా సొంతింట్లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. వందేమాతరంతో పాటు ఇథియోపియా జాతీయ గీతం కూడా భూమిని తల్లిగా వర్ణిస్తాయని చెప్పారు.
శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేశారని హీరో నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం తమ కుటుంబం తరఫున 2 కోట్ల రూపాయలు విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు.
భారత పర్యటనపై అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి సంతోషం వ్యక్తం చేశాడు. గోట్ టూర్‌లో ఇండియా తనకు గొప్ప ఆతిథ్యం ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మెస్సీ స్పెషల్ వీడియోను పంచుకున్నాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 26న ఆరంభం కానుంది. మే 31 వరకు 19వ సీజన్ జరగనుంది. ఐపీఎల్-18లో బెంగళూరు నెగ్గాక చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో అక్కడ మ్యాచ్లు జరుగుతాయా లేదా అనేది అనుమానంగా మారింది.