E-Paper
Advertisement

Top 20 News: భార్యభర్తల గొడవలో హోమ్ గార్డ్ పై దాడి, ఓటు వేయలేదని.. మనస్తాపంతో యువకుడు సూసైడ్

Top 20 News: భార్యభర్తల గొడవలో హోమ్ గార్డ్ పై దాడి, ఓటు వేయలేదని.. మనస్తాపంతో యువకుడు సూసైడ్

1. ఏపీ అభివృద్ధి.. సీఎం సమీక్ష

ఏపీ అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పది సూత్రాల అమలు, సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. సాంకేతికతను జోడించి పాలనను వేగవంతం చేయడం, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల కల్పనపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

2. కవిత ఆగ్రహం

రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో జరుగుతున్న అవకతవకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంచర్లు, విద్యాసంస్థలను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను మార్చి, పేద రైతుల భూములను లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు.

3. భార్యభర్తల గొడవలో హోమ్ గార్డ్ పై దాడి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో హోంగార్డుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. భార్యా భర్తల గొడవ విషయమై డయల్ 100కు ఫోన్ రావడంతో కానిస్టేబుల్ విజయేందర్, హోంగార్డ్ రఘురాం ఘటనా స్థలానికి వెళ్లగా.. సతీష్ అనే వ్యక్తి కానిస్టేబుల్, హోంగార్డుపై కర్రతో దాడి చేశాడు. హోంగార్డు రఘురాం తలకు తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

4. నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్లు స్వాధీనం

నిజామాబాద్ జిల్లా జలాల్‌పూర్‌లో నకిలీ నోట్ల తయారీ కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సర్పంచ్ మమత భర్త బాలు, అతని తమ్ముడు శంకర్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 9.86 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ, ప్రింటర్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు ఈ నోట్లను పంపిణీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

5. సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా వల్లంపట్లలో భూమి సమస్యపై కర్ల రవి అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. భూమి కొనుగోలులో రిజిస్ట్రేషన్ విషయంలో మోసపోయానని, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతనికి న్యాయం చేస్తామని నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

6. ఓటు వేయలేదని.. మనస్తాపంతో యువకుడు సూసైడ్

రంగారెడ్డి జిల్లా గోపులారంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సాయికుమార్, తనకు ఓటు వేయలేదని అనిల్‌కుమార్ అనే యువకుడిని మందలించారు. దీనివల్ల మనస్తాపానికి గురైన అనిల్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7. డీసీఎం కంటైనర్‌లో ఏకంగా 200 కేజీల గంజాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి చెన్నైకి డీసీఎం కంటైనర్‌లో సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసి తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. దీని విలువ మార్కెట్లో రూ. 98 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వాహనాలను సీజ్ చేశారు.

8. సీతక్క హర్షం

ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ సంప్రదాయాల నడుమ పగిడిద్దరాజు, గోవిందరాజుల ధ్వజస్తంభాల పునఃప్రతిష్ట అట్టహాసంగా పూర్తయింది. పెనక వంశస్థులు, పూజారుల ఆధ్వర్యంలో రహస్య పూజలు నిర్వహించి ఈ ఘట్టాన్ని ముగించారు. ఆలయ పునర్నిర్మాణంలో ఇది తొలి అడుగని మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

9. నిందితుడిని పట్టుకుంటాం..

మణికొండ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం సీఐ వెంకన్న స్పందించారు. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్న భవాని అనే మహిళను అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టిందని తెలిపారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించామన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారు వివరాలు సేకరించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

10. బైకు ఢీకొని.. పది అడుగుల దూరంలో కాలు విరిగి..

నంద్యాల జిల్లా సోమయాజులలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలి పనికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో వృద్ధురాలు లక్ష్మీదేవిని బైకు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి పది అడుగుల దూరంలో పడింది. మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

11. మంత్రి సన్మానం

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మంత్రి వివేక్ సన్మానించారు. గ్రామ పంచాయతీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని తెలిపారు.

12. బాధితులకు అందజేత

ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతతో గత మూడు నెలల్లో 50 లక్షల రూపాయల విలువైన 342 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 9.50 కోట్ల రూపాయల విలువైన 6,447 ఫోన్లను ట్రేస్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

13. జాగ్రత్తలు తీసుకుంటాం

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని NH-565పై గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండేళ్ల ఆడపులి మృతి చెందిన ఘటనపై మార్కాపురం ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ స్పందించారు. పోస్టుమార్టం అనంతరం పులి కళేబరాన్ని దహనం చేశామని తెలిపారు. వన్యప్రాణుల రక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని వెల్లడించారు.

14. అభినందనలు

ఏలూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బడేటి చంటిని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ కలిసి అభినందనలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్టానానికి బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని నాయకులకు, కార్యకర్తలకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

15. SP హెచ్చరిక

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా.. దేశవ్యాప్తంగా లక్కీడీప్‌ ద్వారా టికెట్‌ పొందిన వారికి మాత్రమే 3 రోజుల దర్శనం అంటూ వచ్చిన వార్తలను SP సుబ్బరాయుడు ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈనెల 30 నుంచి జనవరి 1వరకు.. రోజుకు 60 వేల మందికి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

16. మిల్లర్ వ్యాఖ్యలు

వలసదారుల పిల్లల పట్ల ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లుగా అమెరికాలో పుట్టిన వలసదారుల సంతతి దేశానికి చేసిందేమీ లేదని, వారు సంక్షేమ పథకాలను వాడుకుంటూ నేరాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు.

17. కీలక మార్పు

హెచ్‌-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పు చేపట్టేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతమున్న ర్యాండమ్‌ లాటరీ విధానానికి స్వస్తి పలికి.. అధిక నైపుణ్యాలు, ఎక్కువ వేతనాలు ఉన్న వ్యక్తులకు ఆ వీసాల జారీలో ప్రాధాన్యమిచ్చే సరికొత్త వ్యవస్థను దాని స్థానంలో ప్రవేశపెట్టాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది.

18. ముంబై రాజకీయాల్లో భారీ మార్పు

ముంబై రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రాజకీయంగా చేతులు కలిపారు. వచ్చే ఏడాది జరిగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సోదరుల కలయిక మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

19. సూర్యకుమార్ కోసమే..

2026 టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో శుభ్‌మన్‌ గిల్‌ వైస్ కెప్టెన్సీతో పాటు స్థానాన్ని కోల్పోవడంపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, జట్టులో ఫామ్ లేని ఒకరిని మాత్రమే కొనసాగించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. సూర్యకుమార్‌కు చోటు కల్పించడానికే గిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.

20. టీజర్ రిలీజ్..

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ‘ఛాంపియన్‌’. అనస్వర రాజన్‌ హీరోయిన్‌. ఈ పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ టీజర్‌ను ‘సెలబ్రేషన్ ఆఫ్‌ ఛాంపియన్‌’ అంటూ ఎన్టీఆర్‌ విడుదల చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×