ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు విననున్నారు.
ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం నుంచి నేరుగా వరంగల్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారు. అక్కడ పత్తి రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
మంత్రి పొంగులేటి కీలక నిర్ణయాలను ప్రకటించారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని.. ఇకనైనా మేల్కొని ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. మతం మారిన వారంతా ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని ఆయన కోరారు. సనాతన ధర్మ పరిరక్షణే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్ల జారీపై మంత్రి పీఏ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కమిషనర్ తెలిపారు. ఫేక్ లెటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితులను కోరారు.
తణుకులో లేహం ఫుడ్ ఫ్యాక్టరీ నడవకుండా అడ్డుకున్నామన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కూటమి ప్రభుత్వం వచ్చాక గోవధ పెరిగిందని, తణుకులో మూడు కంటైనర్ల గోమాంసం పట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని.. స్థానిక నేతలు వాటాలు పెట్టుకున్నారని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మనం అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్లో కార్మికుల సంఖ్య, సౌకర్యాలు ఆధారంగా పెద్ద స్థాయిలో ఉత్పత్తి జరగాల్సి ఉన్నప్పటికీ ఎందుకు నష్టాలు వస్తున్నాయి అనే బాధ ఉందన్నారు.
పిఠాపురం మూలపేటలో విద్యార్థులు ఆర్టీసీ బస్సు ముందు ఆందోళన చేశారు. ‘ఫ్రీ బస్సు’ పథకంతో బస్సులు రద్దీగా ఉండటం వలన కాలేజీలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని SFI అధ్యక్షుడు సిద్దు తెలిపారు. ప్రమాదాలు జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ ఎక్సైజ్ ఎస్సై కారుకు ప్రమాదం జరిగింది. ఐటిపాముల వద్ద జాతీయ రహదారిపై రన్నింగ్‌లో ఉండగా ఆయన కారు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు మంత్రి ఆనం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఉదయం 9 గంటలైనా చలి ప్రభావం తగ్గడం లేదు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, అలాగే తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, గుంపెనగూడెంలో పట్టా భూమి కబ్జాపై నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న రైతు అరవింద్, ఎమ్మెల్యే తల వెంకటరావు జోక్యంతో దీక్ష విరమించారు. రెవెన్యూ అధికారుల స్పందన లేదంటూ రైతు నిరసన చేపట్టగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తులో NIA వేగం పెంచింది. ఈ కేసులో సూసైడ్ బాంబర్ టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని NIA ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ ఉగ్రదాడికి ఉపయోగించిన హ్యుండయ్ I20 కారు అమీర్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించిన తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ కారులో కాలిపోయిన మృతదేహం ఉమర్‌దేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది.
దివంగత కవి, రచయిత అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే అందెశ్రీ పేరిట స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రతి టెక్స్ట్ బుక్ మొదటి పేజీలో అందెశ్రీ గేయం ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది తెలగాణ కేబినెట్.
గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిగ్ ప్లాట్‌ఫాం వర్కర్లకు లీగల్ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మొట్టమొదటిసారి గిగ్ కార్మికులకు ప్రత్యేక ఐడీ జారీ కానుంది. సామాజిక భద్రత కోసమే రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. అల్గారిథమిక్ పారదర్శకత తప్పనిసరి చేస్తుండటంతో చెల్లింపులు, తగ్గింపులపై పూర్తి క్లారిటీ రానుంది. పని భద్రత కోసం నోటీసు పీరియడ్ తప్పనిసరి నిబంధన ఉండనుంది.
ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందన్నారు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పలు చర్యలు తీసుకుంటోందని పరోక్షంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపులకు లొంగిపోయే స్థితిలో భారత్ లేదన్నారు ఉపేంద్ర ద్వివేది.
భారత నౌకాదళానికి చెందిన తొలి యాంటీ సబమెరైన్ వార్ఫేర్ షాలో వాటర్‌క్రాఫ్ట్ ఐఎన్ఎన్ మహేను 24న ప్రారంభించనున్నట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి. కొచ్చిన్ షిప్‌యార్టులో నిర్మించిన ఈ నౌకలో 80 శాతం స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. నౌక వెస్ట్రన్ సిబోర్డు అధీనంలో కార్యకలాపాలు కొనసాగించనుంది.
రష్యాతో యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఉక్రెయిన్, ఫ్రాన్స్ నుంచి 100 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ, మెక్రాన్‌లు ఒక ఆసక్తత పత్రంపై సంతకాలు చేశారు. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, వారు క్రీడేతర నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు జవాబుదారీగా ఉంటారని తెలిపాడు. నిర్ణయాల విషయంలో కెప్టెన్లకు నిరంతరం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రశ్నలు సంధిస్తుంటాయన్నాడు.
సాయి పల్లవి – ధనుష్ మరోసారి జంటగా మురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ ప్రస్తుతం ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సాయిపల్లవిని రంగంలోకి దించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.