Sankranti Holidays: సంక్రాంతి రానే వస్తోంది. సంక్రాంతి రాకతో పల్లెల్లో పండుగ శోభ కనిపించబోతోంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలలో గల ప్రజలు, తమ గ్రామాల బాట పట్టారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేకంగా బస్సులు రైళ్లను నడుపుతున్నట్లు ఇప్పటికే ప్రకటన సైతం జారీ చేశాయి. అయితే సంక్రాంతి సెలవులపై ఏపీ, తెలంగాణ లలో అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించాయి.
సంక్రాంతి వచ్చిందంటే చాలు పాఠశాలలకు సెలవులు మంజూరవుతాయి. పండుగ పురస్కరించుకొని విద్యార్థులందరూ ఆనందోత్సహాలతో తమ గృహాలలో సందడి చేస్తారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఏపీలో ఈనెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి పర్వదిన సెలవులను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరల 20వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఏపీలో మొత్తం 10 రోజులు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలో జనవరి 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను మంజూరు చేసినట్లు ఆదేశాలు వెలువడ్డాయి. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 11 నుండి 16 వరకు మాత్రమే సంక్రాంతి సెలవులను మంజూరు చేశారు. పదవ తరగతి విద్యార్థుల వరకు ఏడు రోజులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆరు రోజులుగా సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.