KTR Press Meet: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫార్ములా ఈ కారు కేసులో క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేయడంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హైకోర్టు కేవలం క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టివేసింది. నాకు ఏదో ఉరిశిక్ష పడినట్లు కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్లకు ఎందుకింతా సంతోషమో మరీ అర్థం కావడం లేదు’ అని కేటీఆర్ అన్నారు. తాను న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఫార్ములా ఈ కారు రేసులో తాను ఎలాంటి అవినీతి పాల్పడలేదని పునరుద్ఘాటించారు.
‘నా మీద పెట్టిన కేసులో ఎలాంటి అవినీతి లేదని.. ఇది లొట్టపీసు కేసు అని మరోసారి అన్నారు. రూ.50లక్షలతో దొరికిన దొంగలకు, పొలిటికల్ బ్రోకర్లకు ప్రతిపనిలో అవినీతి కనిపిస్తోంది’ అని అన్నారు. కొంతమందికి ఇదంతా పుట్టుకతో వచ్చిన బుద్ది అని.. కాంగ్రెస్ నాయకులు నేను ఏదో తప్పు చేస్తున్నట్లు హడావిడి చేస్తున్నారని అన్నారు. ఏదో జరిగినట్టు కాలక్షేపం చేస్తున్నారుని చెప్పారు. ‘నామీద పెట్టిన అక్రమ కేసు. ఇదొక పొలిటికల్ మోటివేటెడ్ కేసు. ఇదొక కక్ష సాధింపు చర్య. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎవరికి భయపడను. ప్రతి పనిలో కాంగ్రెస్ కు అవినీతి కనిపిస్తోంది. రాజ్యాంగ పరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘హైకోర్టు క్వాష్ పిటిషిన్ కొట్టేసినందుకే నేనేదో తప్పు చేసినట్లు సంబరాలు చేసుకుంటున్నారు. కొంత మంది మంత్రులు వారే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్లతో కలిసి విచారణకు హాజరవుతా. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పెట్టిన విచారణకు సిద్దమే. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీలాగా నికృష్ట ఆలోచనలు మాకు లేవు. ఏ విచారణకు అయినా వస్తాను. ఏసీబీ విచారణకు హాజరవుతా. ఈ నెల 16 వ తారీఖును ఈడీ విచారణకు కూడా హాజరవుతా.. నేను నిజాయితీగా ఉన్నాను. ఏ తప్పు చేయని వ్యక్తిగా చెబుతున్నా. ఎలాంటి విచారణ అయనా ఎదుర్కొంటాను’ అని కేటీఆర్ అన్నారు.
‘హైకోర్టు నాకు ఎలాంటి శిక్ష వేయలేదు. ముఖ్యమంత్రి చెప్పే మాటలు అన్నీ భగవద్గీత సూక్తులు కావు. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే భయపడి పారిపోయారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ధైర్యంతో చెబుతున్నా. కోర్టులో న్యాయం పోరాటం చేస్తా. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు. సుప్రీంకోర్టులో న్యాయం కోసం ఎదుర్కొంటా. నన్ను ఎవరు ఏం చేయలేరు. రేపు హైకోర్టుకు కూడా పోతున్నా’ కేటీఆర్ చెప్పారు.
Also Read: HPCL Jobs: బీటెక్ అర్హతతో పోస్టులు.. నెలకు రూ.25,000 స్టైఫండ్.. పూర్తి వివరాలివే..
లాయర్ల సమక్షంలోనే విచారణ చేపట్టాలని, చట్టపరమైన రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఫార్ములా ఈ-కారు కేసులో ఏం జరగబోతుందో కొందరు మంత్రులు ముందే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. విచారణ సచివాలయంలో జరగదని, మంత్రుల పేషీలోనూ జరగదని, న్యాయస్థానాల్లోనే జరుగుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేతలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే వెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు. ఫార్ములా ఈ- కారు రేస్ కు సంబంధించి రూపాయి అవినీతి కూడా జరగలేదని కేటీఆర్ మరోసారి చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా కక్ష సాధింపు కేసు అని తెలిసినా కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యానని, కానీ ప్రభుత్వం తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.