‘Tire failure’ listed as potential cause of fatal Mississippi bus crash 7 died 37 injured: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం అర్థరాత్రి జరిగిన ఈ దుస్సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్సిస్సప్పీ ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ప్రయాణికులు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. అసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
ప్రయాణికుల హాహాకారాలు
దాదాపు మరో 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టడంతో క్షతగాత్రులు క్షేమంగా బయటపడ్డారు. మిస్సిస్సిపీ ప్రాంతంలోని ఇంటర్ స్టేట్ రూట్ 20 వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.
పెట్రోలింగ్ పోలీసుల స్పందన
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను ప్రయాణికులు అభినందిస్తున్నారు. ప్రమాదానికి ఇంకా స్పష్టమైన కారణం తెలియలేదు. ఒక్కసారిగా ప్రయాణికులతో వెళుతున్న వాహనం తాలూకు టైర్లు పేలిపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. టైర్లు పేలిపోవడంతో డ్రైవర్ అదుపు తప్పి బ్రేకులు వేయబోసేలోగా బస్సు తలక్రిందులయింది. ఇందులో విద్రోహుల కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
వివరాలకు సంప్రదించండి
ప్రతి రోజూ బస్సు కండిషన్ చెక్ చేసిన తర్వాతే బస్సును నడిపిస్తానని డ్రైవర్ చెప్పారు. కాగా చనిపోయిన వారిలో ఆరేళ్ల చిన్నారి అతని సోదరి కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రయాణికులలో మృతి చెందిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే పోస్టు మార్టం నిర్వహిస్తున్నామని..ఎవరైనా మృతుల గురించి వారి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే తమని సంప్రదించవచ్చని హైవే పెట్రోల్ పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా గాయపడిన ప్రయాణిులను జాక్స్,విక్స్ బర్గ్ ఆసుపత్రులకు తరలించి వారికి ప్రాధమిక చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.