2000 Note : చాలా మందిలో ఇదే అనుమానం. అసలు ఈ మధ్య రూ.2000 నోటు బయట ఎక్కడా కనిపించడం లేదు. RBI కూడా గత మూడేళ్లుగా ఒక్క రూ.2000 నోటును కూడా ముద్రించలేదు. దాంతో… దేశంలో ఈ పెద్ద నోటుకు కాలం చెల్లినట్టేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
2016 నవంబర్లో పెద్ద నోట్లు రద్దు చేసే సమయానికి… రూ.500, రూ.1000 నోట్లు… చెలామణిలో ఉన్న నోట్ల విలువలో 80 శాతానికి పైగా ఉన్నాయి. అంత పెద్దమొత్తంలో ఉన్న నోట్లను మళ్లీ సేమ్ డినామినేషన్ నోట్లతో మార్చాలంటే… చాలా సమయం పడుతుంది. అందుకే పాత నోట్లను వేగంగా మార్చుకునేలా… RBI రూ.2000 నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకొచ్చింది. 2017 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో రూ.2000 నోట్లు 50.2 శాతం ఉన్నాయి. ఐదేళ్లలో అవి క్రమంగా తగ్గి… 2022 మార్చి 31 నాటికి 13.8 శాతానికి పడిపోయాయి. డీమోనిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరిగి… కరెన్సీ నోట్లను వాడే వాళ్ల సంఖ్య చాలావరకు తగ్గిపోవడమే… రూ.2000 నోటు చెలామణి ఆగిపోవడానికి కారణమైంది.
2020, 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క రూ.2000 నోటును కూడా ముద్రించకపోవడం వల్ల వాటి చెలామణి గణనీయంగా తగ్గిందని RBI తన వార్షిక నివేదికలో తెలిపింది. కొన్నేళ్లుగా పెద్ద నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో… RBI కూడా వాటిని ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 274 కోట్లకు పడిపోయిన రూ.2000 నోట్ల సంఖ్య… 2022 ఆర్థిక సంవత్సరం చివరికి 214 కోట్లకు పడిపోయింది.
నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నదే దొంగనోట్లు, నల్లధనాన్ని అరికట్టేందుకు. కానీ… రూ.2000 నోట్లు చెలామణికి వచ్చాక… పెద్దమొత్తంలో నల్లధనాన్ని నిల్వ చేసుకునే అవకాశంతో పాటు దొంగనోట్ల చెలామణి కూడా పెరిగింది. గత మూడేళ్లలో జరిపిన దాడుల్లో… రూ.2000 నోట్ల రూపంలో దాచిపెట్టిన నల్లధనాన్ని భారీగా గుర్తించారు… అధికారులు. అలాగే… రూ.2,000 నకిలీ నోట్లలో 55 శాతం పెరుగుదల ఉన్నట్లు RBI గుర్తించింది. దాంతో… రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసింది. భవిష్యత్ లోనూ RBI రూ.2000 నోట్లు ముద్రించే అవకాశం కనిపించడం లేదని… ఇక దానికి కాలం చెల్లినట్టేనని భావిస్తున్నారు… ఆర్థిక నిపుణులు.