Gobi Paratha: ఇక్కడ మేము కాలీఫ్లవర్ పరాటా రెసిపీ ఇచ్చాము. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. పక్కన చికెన్ గ్రేవీని పెట్టుకొని ఈ పరాటాను ముంచుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి దీన్ని మీరు తిని చూడండి. ఇది ఎంతో నచ్చేస్తుంది. పైగా కాలీఫ్లవర్ పరాటా చేయడం కూడా చాలా సులువు. ఇది అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి మేలే చేస్తుంది. దీన్ని చికెన్ కర్రీతో తినాల్సిన అవసరమే లేదు. ఏ కర్రీ లేకుండా కూడా తినవచ్చు. ఎందుకంటే పరాటా లోపల కాలీఫ్లవర్ స్టఫింగ్ ఉంటుంది. ఇది మంచి రుచిని అందిస్తుంది. ఇక కాలీఫ్లవర్ పరాటా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కాలీఫ్లవర్ పరాటా రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి – రెండు కప్పులు
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – అర స్పూను
కాలీఫ్లవర్ తరుగు – ఒక కప్పు
పచ్చిమిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
పసుపు – చిటికెడు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
కాలీఫ్లవర్ పరాటా రెసిపీ
⦿ కాలీఫ్లవర్ పరాటా చేయడానికి ముందుగా చపాతీ పిండిని కలుపుకోవాలి.
⦿ చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ నూనె వేయడం వల్ల పరాటా మెత్తగా వస్తుంది.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి స్టఫింగ్‌ను రెడీ చేసుకోవాలి.
⦿ ఆ కళాయిలో నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి.
⦿ ఆ తర్వాత తరిగిన కాలీఫ్లవర్ ను వేసి వేయించుకోవాలి.6. అల్లం, పచ్చిమిర్చిని కలిపి పేస్టులా చేసి దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ రుచికి సరిపడా ఉప్పును, పసుపును కూడా వేసి బాగా కలపాలి.
⦿ ఆ తర్వాత తగినంత నీళ్లు వేసి ఈ మిశ్రమం మెత్తగా ఉడికేలా చేసుకోవాలి.
⦿ ఎక్కువ నీరు వేస్తే అది కూరలా అయిపోతుంది. కాబట్టి మూడు స్పూన్ల నీరు వేసి చిన్న మంట మీదే ఈ మొత్తం మిశ్రమాన్ని వేయించాలి.
⦿ ఇది పచ్చివాసన పోయి దగ్గరగా వేపుడు లాగా అయినప్పుడు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
⦿ ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని దాన్ని చిన్న పూరీలాగా వత్తి మధ్యలో ఈ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ చుట్టేయాలి.
⦿ ఆ తర్వాత దాన్ని పరాటాలాగా ఒత్తుకోవాలి.
⦿ స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేసి ఆ నెయ్యి మీద ఈ పరాటాను కాల్చుకోవాలి.
⦿ అంతే టేస్టీ కాలీఫ్లవర్ పరాటా రెడీ అయినట్టే.
గోబి పరాటా తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. దీనిలో మనం ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము కాబట్టి అంతా మేలే జరుగుతుంది. పుదీనా, కొత్తిమీర, కాలీఫ్లవర్, జీలకర్ర ఇవన్నీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి పోషకాహార లోపం రాదు. ఇక గోధుమపిండి తినడం వల్ల శక్తి విడుదలవుతూ ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ రెసిపీ ఆరోగ్యకరం. రైస్ కు బదులు ఇలా కాలీఫ్లవర్ పరాటాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు దీని లంచ్ బాక్స్ రెసిపీగా పెట్టవచ్చు. పిల్లలు అన్నం కూరను ఎక్కువగా ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా పోషకాలు అందేలా పరాటాలు చేసి పెడితే వారు ఇష్టంగా తింటారు.
Also Read: పిల్లలకి చికెన్ పాప్‌కార్న్ ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు
కాలీఫ్లవర్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కాలీఫ్లవర్ తినే వారిలో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి కాలిఫ్లవర్ ని అప్పుడప్పుడు తింటూ ఉండాలి. కాలీఫ్లవర్ లో మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణగా నిలుస్తాయి. కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి బరువు కూడా త్వరగా పెరగరు. కార్బోహైడ్రేట్స్ దీనిలో చాలా తక్కువ అందుకే మధుమేహం ఉన్నవారు కాలీఫ్లవర్ ని తరచూ తింటూ ఉంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాన్ని తగ్గించడంలో కూడా ఇది ముందుంటుంది.