ఇక్కడ మేము స్పైసీగా గోంగూర మీల్ మేకర్ కర్రీ రెసిపీ ఇచ్చాము. దీన్ని మీరు ఒక్కసారి వండుకొని చూడండి. నాన్ వెజ్ కర్రీలు కూడా దీని ముందు దిగదుడుపే. అంత టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మనం ప్రధానంగా గోంగూర వాడాము. కాబట్టి గోంగూరలో ఉండే పోషకాలు మనకి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. చలికాలంలో స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే గోంగూర మీల్ మేకర్ కర్రీని ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.
గోంగూర మీల్ మేకర్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
గోంగూర ఆకులు – రెండు కప్పులు
మీల్ మేకర్ – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినన్ని
నూనె – రెండు స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
టమోటో – ఒకటి
పసుపు – అర స్పూను
కారం – ఒక స్పూను
పచ్చిమిర్చి – రెండు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ధనియాల పొడి – ఒక స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
గోంగూర మీల్ మేకర్ కర్రీ రెసిపీ
1. ఒక గిన్నెలో మీల్ మేకర్‌ను వేసి వేడి నీళ్లు పోసి పావుగంట సేపు నానబెట్టాలి.
2. ఇప్పుడు గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి.
4. ఆ నూనెలో పచ్చిమిర్చిని, గోంగూర ఆకులను వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
5. ఇది దగ్గరగా ఉడికాక స్టౌ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ గోంగూరను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
6. ఈలోపు నీళ్లల్లో వేసిన మీల్ మేకర్ మెత్తగా అవుతుంది.
7. వాటిని చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
9. ఆ నూనెలో మీల్ మేకర్ వేసి కాసేపు వేయించాలి. ఆ వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు మిగిలిన నూనెలో ఉల్లిపాయల తరుగు వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
11. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అందులోనే టమాటో తరుగును కూడా వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
12. దీని కోసం మూత పెడితే టమోటాలు ఇగురు లాగా మెత్తగా ఉడుకుతాయి.
13. మూత తీసాక గోంగూర పేస్ట్ ను వేసి బాగా కలపాలి.
14. అందులోనే పసుపు, కారం వేసి ఒకసారి కలుపుకోవాలి.
15. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి.
16. అర గ్లాసు నీళ్లు వేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని కలిపి మూత పెట్టాలి.
17. పది నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్లను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
18. పది నిమిషాలకి కూర చిక్కగా ఉడికేస్తుంది. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయినట్టే.
Also Read: ఎగ్ 65 రెసిపీ, రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది
ఇక్కడ మేము చెప్పినట్టు గోంగూర మీల్ మేకర్ కర్రీని వండుకొని వేడి వేడి అన్నంలో తినేందుకు ప్రయత్నించండి. ఇది పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ కర్రీని వండుకుంటే ఎవరికైనా నచ్చుతుంది. ఇందులో మనం ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వేసాము. కాబట్టి ఎన్నో పోషకాలు కూడా శరీరానికి చేరుతాయి. గోంగూరలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గోంగూర వంటకాలను చలికాలంలో తినాల్సిన అవసరం ఉంది. ఇంక మీల్ మేకర్ ను సోయాబీన్స్ తో చేసినవే ఎంపిక చేసుకోండి. సూపర్ మార్కెట్లలో సోయా చంక్స్ పేరుతో ఈ మీల్ మేకర్ దొరుకుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బయట లూజ్ గా దొరికే మీల్ మేకర్లో మైదాపిండి కలిసే అవకాశం ఉంది. కాబట్టి సోయా చాన్స్ పేరుతో అమ్ముతున్న వాటిని కొంటే ఉత్తమం.