భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు ఎన్నో త్యాగాలు చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు ఎంతో కష్టపడాలి. అప్పుడే వారి బంధం కలకాలం నిలుస్తుంది. అయితే భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ సరిగా లేకపోయినా ఆ సంసారం నడవడం చాలా కష్టంగా మారిపోతుంది. మీకు తెలియకుండానే సంబంధాన్ని దెబ్బతీసే అలవాట్లు మీకు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి. ఇక్కడ మేము అలాంటి అలవాట్లు కొన్ని ఇచ్చాము. ఇవి మీకు ఉన్నాయేమో మీరు మీ జీవిత భాగస్వామితో అలా ప్రవర్తిస్తున్నారేమో ఓసారి ఆలోచించండి.
మాట వినకపోవడం
మాట వినకపోవడం అంటే ఆమె లేదా అతడు చెప్పింది పాటించకపోవడం అని కాదు. వారి బాధను, వారి ఆలోచనలను ఓపిగ్గా కూర్చొని వినకపోవడం. భార్యాభర్తలు ఒకరికొకరుగా జీవిస్తారు. ఒకరి బాధలను మరొకరు కచ్చితంగా వినాలి. అలా విన్నప్పుడు జీవిత భాగస్వామి సంతోషంగా జీవిస్తారు. కానీ కొంతమంది తమ జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడరు. ఆమె లేదా అతడు చెప్పే విషయాలను పట్టించుకోరు. ఆమె మాట్లాడుతున్నా కూడా వినకుండా వెళ్ళిపోతారు. చాలా అశ్రద్ధగా వింటున్నట్టు ముఖం పెడతారు. ఇది భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తున్నట్టే లెక్క. నిజానికి మీ జీవిత భాగస్వామిని ఈ ప్రవర్తన విపరీతంగా బాధిస్తుంది.
ఆమె ఇష్టాన్ని గౌరవించండి
కొంతమంది భార్య లేదా భర్తలు భాగస్వామికి ఏమి అవసరమో అర్థం చేసుకొని అడగకుండానే తెచ్చిస్తారు. మరికొందరు మాత్రం అవసరాన్ని గుర్తించినా, అడిగినా కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. వారికి కావలసిన వస్తువులను కూడా తెచ్చి ఇవ్వడానికి ఇష్టపడరు. ఏ విషయాన్ని అయినా వారి జీవిత భాగస్వామికి తెలియకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విషయాలను దాచిపెడుతూ ఉంటారు. వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, అందించాల్సిన సహకారాన్ని కూడా ఇవ్వరు. ఇవన్నీ కూడా ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి.
ఏదైనా విషయం చెప్పినప్పుడు లేదా ఏదైనా కొనమని అడిగినప్పుడు తిరస్కరించడం అనేది సాధారణమే. అయితే ఆ తిరస్కరణ అమర్యాదగా ఉండకూడదు. మీ భాగస్వామి తన ఆలోచనలను, భావాలను, భయాలను చెబుతున్నప్పుడు వారి మాటలను తిరస్కరించే విధంగా ఉండకండి. ఇదే మీ జీవిత భాగస్వామిలో భయాన్ని మరింతగా పెంచేస్తుంది. మీపై అయిష్టతలను కూడా పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అనుబంధాన్ని కాపాడుకోవాలంటే జీవిత భాగస్వామి చెప్పేది వినాలి. వారికి కావలసిన గౌరవాన్ని అడగకుండానే ఇవ్వాలి. తమ భావాలను పంచుకుంటున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని ధైర్యం చెప్పాలి. అలా కాకుండా వారి ఆలోచనలు భావాలు, భయాలను పట్టించుకోకుండా తిరిగితే కొన్నాళ్ళకి మీ అనుబంధం బలహీనంగా మారిపోతుంది.