పొద్దున్నే నిద్ర లేవగానే తాగే టీ నుంచి రాత్రి పడుకునే ముందు తీసుకునే పాల వరకు చక్కెరను వాడుతాం. ఇంట్లో తయారు చేసే బోలెడు పదార్థాలలో చక్కెరను కలుపుతాం. కానీ, చక్కెర మాంసాహారమా? శాకాహారమా? అనేది ఎవరూ పెద్దగా ఆలోచించరు. చెరుకు గడల నుంచి తయారు చేసే చక్కెర వెజ్ అవుతుంది గానీ, నాన్ వెజ్ ఎలా అవుంది? అని ఎదురు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీరూ.. ఇలాంటి ఆలోచనతోనే ఉంటే.. కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
చక్కెరకు తెలుపు రంగు ఎలా వస్తుందంటే?
సాధారణంగా ముడి చక్కెర అనేది ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. శుద్ధి ప్రక్రియ ద్వారా దాన్ని ముదురు వర్ణం తొలగి పోతుంది. స్వచ్ఛమైన తెలుపు వర్ణంలోకి మారుతుంది. ఈ శుద్ధి ప్రక్రియలోనే అసలు కథంతా ఉంటుంది. చక్కెరకు తెలుపు రంగు వచ్చేందుకు జంతువుల ఎములక పొడిని కలుపుతారు. ఈ ప్రక్రియను బోన్ చార్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా చక్కెర తయారీ సంస్థలు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో చక్కెరకు తెలుపు రంగును తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పద్దతిని కొనసాగిస్తున్నాయి. ఇంతకీ చక్కెరలో జంతువుల ఎముకల పొడి ఎందుకు కలుపుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెర తయారీలో ఎములక పొడి ఎందుకు కలుపుతారు?
చక్కరను తెలుపు రంగులోకి తీసుకురావడానికి ఎముకల పొడిని కలుపుతారు. బోన్ చార్ ను సహజ కార్బన్ అని కూడా పిలుస్తారు. ఇది జంతువుల ఎముకల నుంచి తయారు చేస్తారు. ఈ బోన్ చార్ లో ట్రైకాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్, కార్బన్ పదార్థాలు ఉంటాయి. ఈ బోన్ చార్ అనేది పలు పదార్థాల శుద్ధిలో ఫిల్టర్ గా ఉపయోగిస్తారు. అలాగే చక్కెర శుద్ధి ప్రక్రియలోనే ఈ బోన్ చార్ ను ఉపయోగిస్తారు. చక్కెర చక్కటి రంగును, ఆకృతిని పొందేందుకు డీకోలరైజింగ్ ఫిల్టర్ గా ఈ ఎముకల పొడి పనిచేస్తుంది.
ఇండియాలోనూ చక్కెర శుద్ధిలో బోన్ చార్ కలుపుతారా?
భారత్ లో చక్కెర తయారీ విధానంలో బోన్ చార్ కలపరని పలు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి పద్దతి అమెరికా సహా పలు ఇతర దేశాల్లో ఉన్నట్లు వెల్లడించాయి. మన దేశంలోని పలు రిఫైనరీలలో చెరుకును ఇతర పద్దతుల ద్వారా శుద్ధి చేస్తారు. సింథటిక్ అయాన్ ఎక్స్ఛేంజ్ రెసిన్లతో పాటు సల్ఫర్ డయాక్సైడ్ ను వినియోగించి చక్కెరను ప్రాసెస్ చేస్తారు. సో, మనం వాడే చక్కెర వెజ్ గానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.
చక్కెర వినియోగాన్ని తగ్గించాలంటున్న నిపుణులు
నిజానికి చక్కెర వినియోగాన్ని తగ్గించాలంటున్నారు డాక్టర్లు. చక్కెరకు బదులుగా ప్రత్యామ్నాయ తీపి పదార్థాలను ఉపయోగించాలంటున్నారు. ఆర్గానిక్ తేనె, మాపుల్ సిరప్, కిత్తలి హనీ, సల్ఫర్ లేని మోలాసిస్, డేట్స్ సిరప్, బ్రౌన్ రైస్ సిరప్ వాడటం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.
Read Also: మీ ఒంట్లో ‘చక్కెర’ ఉందా? అయితే.. చలికాలంలో ఈ ఫుడ్ తింటే బెటర్, లేకపోతే…