ఈ రోజుల్లో ఏ వేడుక చేసినా.. సుక్క, ముక్క ఉండాల్సిందే. ముక్కలు తక్కువై తన్నుకున్న సందర్భాలు చూశాం. చివరకు కొన్ని పంచాయితీలు పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లాలి. కాసేపు వాటి గురించి పక్కన పెడితే, ప్రస్తుతం ఏ దావత్ చేసినా నాన్ వెజ్ అనేది ఓ సంప్రదాయంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలోనే మాంసాహారం తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత్ లో ప్రపంచంలోనే అత్యధికంగా శాకాహారం తీసుకునే జనాభా ఉండగా, మాంసాహారాన్ని ఆస్వాదించే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. దేశంలో 85 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని తీసుకుంటున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది.
నాగాలాండ్ కు టాప్ ప్లేస్
తాజాగా అధ్యయనం ప్రకారం దేశ వ్యాప్తంగా అత్యధికంగా మాంసం తీసుకునే రాష్ట్రాల్లో నాగాలాండ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక్కడి జనాభాలో 99.8 శాతం మంది మాంసాహారం తీసుకుంటున్నట్ల వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 99.3 శాతం మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తేలింది. ఇక కేరళ మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 99.1 శాతం మంది మాంసాహార వంటకాలను తినేందుకు ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది.
నాలుగో స్థానంలో నిలిచిన ఉభయ తెలుగు రాష్ట్రాలు
ఇక అత్యధిక మాంసాహార వినియోగదారుల లిస్టులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉన్నట్లు తాజా సర్వే తెలిపింది. రెండు రాష్ట్రాల జనాభాలో 98.25 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు, చికెన్, మటన్ కర్రీలు కూడా ఇష్టంగా తింటున్నట్లు తేలింది. ఇక ఐదో స్థానంలో తమిళనాడు నిలిచింది. ఈ రాష్ట్రంలో 97.65 శాతం మంది ప్రజలు మాంసాహార ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ ఎక్కువగా తీసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఒడిశా ఏడవ స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు 97.35 శాతం మంది మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
గత ఏడాది టాప్ ప్లేస్ లో నిలిచిన తెలంగాణ
ఇక గత ఏడాది కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా మాంసాన్ని ఎక్కువగా తినే వారి లిస్టులో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. 99 శాతంతో తెలంగాణ టాప్ లో ఉండగా, తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. ఏపీ 98 శాతం మంది మాంసాహారులతో మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో గత ఏడాది 70 శాతం మంది మాంసాహారు ఉన్నట్లు తేలగా ఇప్పుడు ఆ సంఖ్య 85 శాతానికి పెరిగింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో మాంసం ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో కిలో మటన్ రూ. 500 నుంచి రూ. 600 ఉంటే, ఇక్కడ మాత్రం రూ. 800 నుంచి రూ. 1000 వరకు పలుకుతున్నట్లు తేలింది. ప్రతి వ్యక్తి ఏడాదికి మాంసం మీద సగటున రూ. 60 వేలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: ఇలాంటి ఆహారాలను ప్రతిరోజూ తింటే మీ పొట్ట పాడైపోవడం ఖాయం, వెంటనే మానుకోండి
December 23,2024 20:54 pm