Masala Tea: సీజన్ ఏదైనా సాయంత్రం వేళ, లేదా ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి మసాలా టీ తాగితే ఆ అనుభూతే వేరు. మసాలా టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇది కేవలం రుచి, సువాసన కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా చాలా మంచిది. పాలు, టీ ఆకులతో పాటు అల్లం, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి వాటితో తయారు చేసిన ఈ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం ఒక కప్పు మసాలా టీ తాగడం వల్ల బోలెడు లాభాలు ఉంటాయి. ఇంతకీ మసాలా టీ వల్ల కలిగే 4 ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
మసాలా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మసాలా టీలో వాడే మసాలా దినుసులు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అల్లం, లవంగాలు, దాల్చిన చెక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గుణాలు శరీరంలోకి ప్రవేశించే క్రిములను నాశనం చేసి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ వ్యాధులను నివారిస్తాయి. రోజూ ఒక కప్పు మసాలా టీ తాగడం వల్ల మీ శరీరం వ్యాధులపై పోరాడే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మసాలా టీ జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే అల్లం జీర్ణ క్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అలాగే.. యాలకలు, లవంగాలు, మిరియాలు కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం వంటి సమస్యలను తగ్గిస్తాయి. మసాలా టీ తాగడం వల్ల భోజనం త్వరగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. అందుకే.. చాలామంది భోజనం తర్వాత మసాలా టీని తాగుతారు.
3. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
మసాలా టీలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. దాల్చిన చెక్క రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్త పోటును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది. అలాగే.. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Also Read: రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్కటి తింటే చాలు.. వ్యాధులు రమ్మన్నా రావు !
4. మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తుంది:
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో మసాలా టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం, యాలకల సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మసాలా టీ తాగడం వల్ల మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుతుంది. ఇది మానసిక అలసటను తగ్గించి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక కప్పు మసాలా టీ తాగడం వల్ల రిలాక్స్ అవ్వడానికి సహాయ పడుతుంది.
మసాలా టీ కేవలం రుచికరమైంది మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని సుగంధ ద్రవ్యాలు మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే.. రోజులో కనీసం ఒక్కసారైనా ఈ టీని తప్పకుండా తాగడం అలవాటు చేసుకోండి. కానీ, అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తాగే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.