Healthy Seeds: ప్రస్తుతం చాలా మంది డ్రై సీడ్స్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీడ్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి. కానీ వీటిలో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, జింక్, కాల్షియం, రాగి, మెగ్నీషియం వంటి ఖనిజాలు సీడ్స్‌లో ఉంటాయి. ఈ సూపర్ సీడ్స్‌ను ఆరోగ్య నిధి అని పిలిస్తే.. అతిశయోక్తి కాదు. మరి డ్రై సీడ్స్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఏ ఏ సీడ్స్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్:
చియా సీడ్స్‌లో ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు , ఒమేగా-3 వంటి ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల చియా విత్తనాలలో ఇనుము, కాల్షియం, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్, భాస్వరం వంటి చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ వీటిని మన ఆహారంలో కొద్ది మొత్తంలో చేర్చుకుంటే.. జీవక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.ఈ విత్తనాలు నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని కారణంగా అవి కడుపులో ఉబ్బుతాయి. అందుకే ఆకలిని కూడా తగ్గిస్తాయి. అంతే కాకుండా బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. వీటిని సూప్‌లు, పాలు లేదా సలాడ్‌లు వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.
అవిసె గింజలు:
అవిసె గింజలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు , యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలు రాకుండా నివారిస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ప్రకారం.. ఒక టీస్పూన్ అవిసె గింజల పొడిని రోజుకు 2-3 సార్లు తీసుకుంటే.. మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను తగ్గించవచ్చు.
నువ్వులు:
నువ్వులు తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. నువ్వుల్లో ఐరన్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. నువ్వులలో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనం అందిస్తాయి. పెద్ద ప్రేగులకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. నువ్వులను తరచుగా తినడం వల్ల ఎముకలు బలపడతాయి. అంతే కాకుండా ఇవి ఆర్థరైటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నువ్వుల నూనెతో కీళ్లకు మసాజ్ చేయడం వల్ల వాపు , నొప్పి తగ్గుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడి , నిరాశను తగ్గిస్తుంది. నల్ల నువ్వుల తినడం కాలేయానికి మంచిది. అంతే కాకుండా కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
గసగసాలు:
గసగసాల్లో ప్రోటీన్, ఫైటోకెమికల్స్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి, కాల్షియం, మాంగనీస్ ,థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. శరీరం యొక్క పూర్తి పోషణకు ఇవి చాలా అవసరం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గసగసాల పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఇందులో నొప్పి నివారణ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కాల్షియం , విటమిన్ డి శరీరానికి అవసరం అవుతాయి,. ముఖ్యంగా స్త్రీలలో 40 సంవత్సరాల వయస్సు తర్వాత కాల్షియం లోపం మొదలవుతుంది. గసగసాలను స్వీట్లలో , డ్రై ఫ్రూట్స్‌గా కూడా ఉపయోగిస్తారు.
Also Read: ముఖం నల్లగా మారిందా ? ఇవి వాడితే.. నిగనిగలాడే చర్మం
పొద్దుతిరుగుడు విత్తనాలు:
వీటిలో విటమిన్ ఇ , ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నేషనల్ సన్‌ఫ్లవర్ అసోసియేషన్ ప్రకారం.. ఒక ఔన్స్ పొద్దుతిరుగుడు విత్తనాలు మీ రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 76 శాతం అందిస్తాయి. ఒక వ్యక్తి తగినంత మొత్తంలో విటమిన్ ఇ తీసుకుంటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి.