Diwali Healthy Laddoos: దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దీపాల వెలుగులు, టపాసుల సందడి, నోరూరించే స్వీట్స్. పండగ వేళ ఇంట్లో రకరకాల పిండివంటలు, లడ్డూలు ఉంటే ఆ ఆనందమే వేరు. అయితే, తీపి వంటకాలతో పండగను ఆస్వాదిస్తూనే ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ పెడితే మరింత మంచిది కదా. అందుకే ఈ దీపావళికి చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్‌కు బదులుగా.. పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌తో రుచికరమైన లడ్డూలను ఇంట్లోనే తయారు చేసుకుందాం. సంప్రదాయ రుచికి ఏమాత్రం తీసిపోకుండా, తక్కువ శ్రమతో సులభంగా చేసుకోగలిగే ఈ హెల్తీ లడ్డూలు పండగకు కొత్త రుచిని తీసుకొస్తాయి. మరి, ఈ దీపావళికి మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన తీపిని అందించేందుకు ఉపయోగపడే ఐదు రకాల హెల్తీ లడ్డూల తయారీ విధానాలను తెలుసుకుందామా!
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో బలమైన రాగులతో ఈ లడ్డూ చేయొచ్చు. రాగి పిండిని నెయ్యితో వేయించి, అందులో నానబెట్టి పేస్ట్ చేసిన ఖర్జూరం, బాదం పప్పులు, నువ్వులు, కొబ్బరి పొరి కలుపుకోవాలి. ఇది మంచి క్యాల్షియాన్ని ఇస్తుంది. షుగర్ లేకుండా నేచురల్ స్వీట్‌నెస్‌తో భలే టేస్టీగా ఉంటుంది.
అసలు పంచదారే వాడకుండా కేవలం ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్‌తో దీన్ని చేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, గుమ్మడి గింజలను నెయ్యిలో దోరగా వేయించి, ఖర్జూరంతో కలిపి మిక్సీ పట్టుకోవాలి. చివర్లో కొబ్బరి పొడిలో రోల్ చేస్తే చూడటానికి భలే ఉంటుంది. పండగ రోజు గెస్ట్‌లకు సర్వ్ చేయడానికి ఇది సూపర్ ఆప్షన్.
Also Read: ఎప్పుడైనా అరటి ఆకులో చికెన్ రోస్ట్ చేసి తిన్నారా? ఈ సండే పక్కా ట్రై చేయండి బాస్!
రోజూ ఉదయం తినే ఓట్స్‌తో ఎప్పుడైనా లడ్డూ ట్రై చేశారా? ఓట్స్‌ను వేయించి పొడి చేసి, అందులో పీనట్ బటర్, ఖర్జూర పేస్ట్, బాదం ముక్కలు కలుపుకోవాలి. ఒక్క పది నిమిషాల్లో అయిపోయే ఈ లడ్డూలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తింటే ఆ రుచే వేరు.
వేసవిలో సత్తు పిండితో డ్రింక్ తాగుతాం కదా.. అదే పిండితో దీపావళికి అదిరిపోయే లడ్డూ చేయొచ్చు. సత్తు పిండిని నెయ్యితో వేయించి, దానికి తగినంత బెల్లం పొడి, నువ్వులు, యాలకుల పొడి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే చుట్టేస్తే గుండ్రంగా పర్ఫెక్ట్ లడ్డూలు రెడీ అవుతాయి. ఇది మన సాంప్రదాయ రుచిని గుర్తు చేస్తుంది.
పల్లీలు, నువ్వులతో చేసే ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీ. వేయించిన పల్లీల పొడిని, నువ్వులను కలిపి, బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. పల్లీల కరకరలాడే రుచి, నువ్వుల సువాసన ఈ లడ్డూకి అద్భుతమైన టేస్ట్ ఇస్తాయి. తక్కువ పదార్థాలతో ఈ పండగకు హ్యాపీగా లడ్డూలు చేసుకోవచ్చు. ఈసారి ఈ హెల్తీ లడ్డూలతో పండగను మరింత మధురంగా మార్చేయండి.
Also Read: సండే రోజు ‘బోన్ మారో మసాలా’ ఇలా చేశారంటే.. ఇంట్లో వాళ్లందరూ లొట్టలేసుకుంటూ తింటారు!