Secunderabad station upgrade works: ఎప్పటినుంచో ప్రయాణికులను వేధిస్తున్న సమస్యకి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికినట్లే. సికింద్రాబాద్ స్టేషన్ కొత్త రూపాన్ని సంతరించుకుంటున్న వేళ, అందరికీ ఊరట కలిగించే సదుపాయం సిద్ధమవుతోంది. ఇప్పుడు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి.. ఇది కావాలే కావాలి! అనిపించే ఫెసిలిటీ రానుంది. ఏంటా ప్రత్యేకం? ఎలా మారబోతుంది స్టేషన్ అనుభవం? అదేంటో తప్పక తెలుసుకోండి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రోజూ వేలాది మంది ప్రయాణికులతో నిత్యం బిజీగా మారే ఈ కేంద్రం ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఆధునీకరణ, ప్రయాణికులకు మరింత సౌకర్యం, రద్దీకి సమర్థ పరిష్కారం అందించేందుకు రైల్వే శాఖ మెగా అప్‌గ్రేడ్ పనుల్లో నిమగ్నమై ఉంది. ఇదే భాగంగా స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, మల్టీ లెవెల్ పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా వంటి కీలక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక సికింద్రాబాద్ స్టేషన్ రూపమే మారనుంది!
అందుబాటులోకి రాబోతున్న కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చేలా ఉండనుంది. ఇప్పటి వరకు రెండు మూడు బ్రిడ్జులే ఉండటంతో ఎక్కువగా రద్దీ సమయంలో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫార్మ్‌లను అనుసంధానిస్తూ, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ర్యాంపులు వంటి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వృద్ధులు, శారీరకంగా బలహీనులైన వారు, పిల్లలతో ప్రయాణించే వారు దీనివల్ల ఎంతో సులభతతో ప్లాట్‌ఫార్మ్ మారగలుగుతారు.
ఇక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం చేపట్టారు. స్టేషన్‌కి వచ్చే ప్రయాణికులు వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేక ఇబ్బంది పడటం ఇక శుభం కార్డు పడినట్లే. 4 నుండి 5 అంతస్తుల పార్కింగ్ సౌకర్యం కలిగిన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే, వాహనాలు క్రమబద్ధంగా పార్క్ అవ్వడమే కాకుండా, రోడ్డు పై ట్రాఫిక్‌ను తగ్గించేలా ఉంటుంది. ముందస్తుగా మొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ బుక్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Ellamma temple Chandragiri: ఈ ఆలయానికి వెళితే.. మద్యం ఇక అస్సలు ముట్టరట!
ఈ అభివృద్ధిలో మరో ముఖ్యమైన అంశం.. స్టేషన్ చుట్టూ ఉండే సర్క్యులేటింగ్ ఏరియా. ఇది ఇప్పటిదాకా అత్యంత గందరగోళంగా మారిన ప్రాంతంగా ఉండేది. బస్సులు, ఆటోలు, ప్రయాణికులు.. అంతా ఒకే చోట కలవడం వల్ల అసౌకర్యం తలెత్తేది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పూర్తిగా మలచి, ప్రత్యేక లేన్లు, పికప్ డ్రాప్ జోన్‌లు, వీలైనన్ని ఎక్కువ టాయిలెట్లు, విశ్రాంతి ప్రాంతాలు, సిమెంట్ రోడ్లు, గ్రినరీ వంటి అంశాలతో తీర్చిదిద్దనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసే సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అంతేకాదు, రానున్న కాలంలో సికింద్రాబాద్ స్టేషన్‌ను నెట్‌జీరో ఎనర్జీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే యత్నం కూడా రైల్వే శాఖ చేస్తున్నది. భవిష్యత్తులో స్మార్ట్ టికెట్ కౌంటర్లు, డిజిటల్ డిస్‌ప్లేలు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, EV వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని రూపొందించిన అప్‌గ్రేడ్ ప్రణాళిక ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోని ఉత్తమ స్టేషన్లలో ఒకటిగా మారనుంది.
ఈ అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్టేషన్‌ను సందర్శించి అధికారుల నుంచి వివరణలు స్వీకరించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మల్టీ లెవెల్ పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా పనులను తనిఖీ చేసి, వేగంగా, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.