Aluminum Foil Hacks: సాధారణంగా వంటగదిలో మిగిలిపోయిన ఆహారాన్ని ప్యాక్ చేయడానికి లేదా బేకింగ్ ట్రేలపై కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్‌ను వాడుతుంటాం. అయితే, మన ఇంట్లోని బట్టల బీరువాలు, డ్రాయర్లలో చిన్న చిన్న అల్యూమినియం ఫాయిల్ బాల్స్ ఉంచడం వల్ల బట్టలు తాజాగా ఉంటాయని, బట్టల సంరక్షణకు ఇవి బాగా ఉపయోగపడతాయని హోమ్ ఆర్గనైజర్లు చెబుతున్నారు. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ.. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.
బట్టలను బీరువాలో ఎక్కువ రోజులు ఉంచినప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం లేదా తేమ ఎక్కువగా ఉండే రోజుల్లో గాలి సరిగ్గా ఆడక బట్టల నుంచి ఒక రకమైన చెడు వాసన వస్తుంది. ఇలాంటి సమయంలో నలిపిన అల్యూమినియం ఫాయిల్ బాల్స్‌ను బీరువాలో పెట్టడం వల్ల ఆ ప్రదేశంలో గాలి కొద్దిగా తిరగడానికి వీలవుతుంది. అయితే ఇది గాలి వెలుతురు రావడానికి లేదా తేమను పూర్తిగా తగ్గించడానికి ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ.. బీరువా లోపల బట్టలు కాస్త ఫ్రెష్‌గా ఉండేలా చేయడానికి మాత్రం సహాయపడుతుంది.
బట్టలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల వాటిలో స్టాటిక్ విద్యుత్ (కరెంట్ చార్జ్) ఏర్పడుతుంది. అందుకే బట్టలు ఆరిన తర్వాత ఒకదానికొకటి అంటుకుపోతుంటాయి. అల్యూమినియంకు విద్యుత్‌ను ప్రసరింపజేసే గుణం ఉంటుంది. వాషింగ్ మెషీన్ డ్రైయర్‌లో బట్టలు ఆరబెట్టేటప్పుడు ఈ ఫాయిల్ బాల్స్‌ను వేయడం వల్ల బట్టల్లో స్టాటిక్ చార్జ్ పేరుకుపోకుండా ఉంటుంది. అందుకే చాలా మంది డ్రైయర్ షీట్లకు బదులుగా ఈ రీయూజబుల్ ఫాయిల్ బాల్స్‌ను వాడుతుంటారు.
Also Read: చీపురను ఉప్పు నీటిలో నానబెడితే.. ఆ సమస్యలన్నీ మాయం, నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ ట్రిక్!
డ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల బట్టలు ఒకదానికొకటి అంటుకోవు. దీనివల్ల బట్టల మధ్య రాపిడి తగ్గి, కాస్త సున్నితమైన దుస్తులు త్వరగా పాడవకుండా ఉంటాయి. అయితే బీరువాలో దాచే బట్టలు పాడవకుండా ఉండాలంటే కేవలం ఈ ఫాయిల్ బాల్స్ మాత్రమే సరిపోవు. బట్టలను దాచే ముందు బాగా ఉతకడం, బీరువాలో ఎక్కువ బట్టలు దట్టించకుండా చూసుకోవడం, తడి లేకుండా జాగ్రత్తపడటం వంటివి కూడా చాలా ముఖ్యం.
ఈ చిన్న చిట్కాను ప్రయత్నించడం చాలా సులభం. వంటగదిలోని అల్యూమినియం ఫాయిల్ నుంచి చిన్న ముక్కను తీసుకుని, చేత్తో గట్టిగా నలిపి చిన్న బాల్ లాగా చేయాలి. వీటిని బీరువా మూలల్లో లేదా డ్రాయర్లలో ఉంచితే సరిపోతుంది. ఇవి కాస్త నలిగిపోయినా లేదా దుమ్ము పట్టినా మార్చేయవచ్చు. అదే బట్టలు ఆరబెట్టే డ్రైయర్ కోసం అయితే కాస్త పెద్ద సైజులో, గట్టిగా ఉండే బాల్స్ తయారు చేసుకుని వాడుకోవాలి.
Also Read: కాబోయే అమ్మలూ.. వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!