మార్కెట్లో విపరీతంగా ద్రాక్ష అమ్మకానికి వచ్చింది. మన దేశంలో అధికంగా పండే పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి. ద్రాక్ష సీజన్ వచ్చిందంటే నలుపు రంగు, ఆకుపచ్చ రంగులో ఉన్న ద్రాక్షలు అధికంగా అమ్మకానికి వస్తాయి. అయితే ద్రాక్షలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం మన దేశంలో అమ్మే ద్రాక్షలపై పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు బయటపడింది. రైతులు తమ పంట నష్టాన్ని నివారించడానికి రసాయన పురుగుమందులను ద్రాక్ష మొక్కలపైనా, పండ్ల పైనా స్ప్రే చేస్తారు. దీని వల్ల ఆ పండ్లపై అవశేషాలు అలాగే ఉండిపోతున్నాయి. ఆ అవశేషాలను సరిగా క్లీన్ చేసుకోకుండా తింటే ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది.
వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కంపెనీ ఎగుమతి చేసే ద్రాక్షలపై పురుగుల మందుల వాడకాన్ని నియంత్రిస్తుంది. కానీ స్థానిక మార్కెట్లలో విక్రయించే ద్రాక్షలో మాత్రం పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే వాటిపై పర్యవేక్షణ చేసే అధికారులు చాలా తక్కువ. కాబట్టి మీరు కూడా బయట ద్రాక్షను కొంటూ ఉంటే చాలా జాగ్రత్తగా వాటిని క్లీన్ చేసుకుని తినాలి.
పురుగుమందుల అవశేషాలు చల్లిన ద్రాక్షలను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య రావచ్చు. అలాగే నాడీ సంబంధిత రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా పెరిగిపోతుంది. కాబట్టి ద్రాక్షలను తినడానికి ముందు సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
ద్రాక్షలపై ఉన్న పురుగుమందుల అవశేషాలను తొలగించడానికి కొన్ని ఉత్తమ మార్గాలు ఉన్నాయి. ద్రాక్షను కనీసం 30 సెకండ్ల పాటు కొళాయి కింద ఉంచాలి. ఆ నీరు ద్రాక్షలపై పడుతున్నప్పుడు అవశేషాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే చేతివేళ్లతో సున్నితంగా రుద్దుతూ ఉండండి. ఇది మురికిని కొన్ని రకాల పురుగు మందులను తొలగిస్తుంది.
ఉప్పుతో శుభ్రం
లీటర్ నీటికి రెండు టీ స్పూన్ల ఉప్పును వేసి ద్రాక్ష పండ్లను పావుగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఆ నీళ్లను ఒంపేసి కొళాయి కింద పెట్టి ఆ నీటి కింద కాసేపు కడగండి. ఉప్పునీటితో ఉప్పునీరు పురుగుమందుల అవశేషాలను విచ్ఛిన్నం చేస్తుంది. పైన ఉన్న మైనపు పూతలను కూడా తొలగిస్తుంది.
బేకింగ్ సోడాతో
రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ద్రాక్ష పండ్లను అందులో వేసి పావుగంట పాటు నానబెట్టాలి. వాటిపై ఏవైనా అవశేషాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. బేకింగ్ సోడా అనేక పురుగు మందులను సమర్ధవంతంగా తొలగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Also Read: టాటూ వేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే
నీటిలో వెనిగర్ వేసి ద్రాక్ష పండ్లను పది నిమిషాలు నానబెట్టాలి. వెనిగర్ పురుగుమందుల అవశేషాలను కరిగించడంలో సహాయపడుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలను కూడా చంపుతుంది. ఆ తర్వాత ఈ పండ్లను కొళాయి కింద పెట్టి శుభ్రం చేస్తే పూర్తిగా అవశేషాలు తొలగిపోయే అవకాశం ఉంది. వీలైనంతవరకూ ద్రాక్షను తొక్కతో కాకుండా తొక్క తీసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే తింటే మంచిది. దీని వల్ల నా పురుగుమందుల అవశేషాలు పొట్టలోకి చేరకుండా ఉంటాయి. అయితే ద్రాక్ష తొక్కలో కొన్ని రకాల పోషకాలు ఫైబర్ ఉంటుంది. వీటిని నష్టపోయే అవకాశం ఉంది.