Back Pain: వెన్నునొప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బాధించే సమస్య. రోజంతా కుర్చులోనే కూర్చోవడం వల్ల చాలా మందికి వెన్నునొప్పి వస్తుంది. కానీ, ఎక్కువసేపు కూర్చోకపోయినా విపరీతమైన వెన్ను నొప్పి వేదిస్తోందని చాలా మంది చెబుతారు. ఎక్కువ కూర్చోవడం ఒక కారణమైనప్పటికీ, ఇతర అనేక కారణాలు కూడా వెన్నునొప్పికి దారితీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అసలు వెన్నునొప్పి రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెన్నునొప్పికి కారణాలు
నిలబడేటప్పుడు, నడిచేటప్పుడు లేదా బరువులు ఎత్తేటప్పుడు సరైన భంగిమ లేకపోతే వెన్నుపై ఒత్తిడి పడుతుందట. వంగడం, ఫోన్ లేదా కంప్యూటర్ వైపు బెండ్ అయ్యి కూర్చోవడం, వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు తప్పుడు భంగిమలు వెన్ను కండరాలు, లిగమెంట్లపై ఒత్తిడిని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫలితంగా వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందట.
బలహీనమైన కోర్ కండరాలు
పొత్తికడుపు, పక్క కండరాలు, వెన్ను కండరాలను కోర్ కండరాలు అని పిలుస్తారు. ఇవి బలహీనంగా ఉంటే వెన్నుకు తగిన సపోర్ట్ లభించదు. దీనివల్ల శారీరక శ్రమలో వెన్నుపై ఒత్తిడి పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గట్టి హామ్‌స్ట్రింగ్‌లు లేదా హిప్ ఫ్లెక్సర్‌ల వంటి అసమతుల్యతలు కూడా వెన్నును సరైన స్థితిలో ఉంచకుండా చేస్తాయట. దీని వల్ల కూడా చాలా మందికి వెన్ను నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
బరువులు ఎత్తడం
బరువైన వస్తువులను తప్పుగా ఎత్తడం లేదా క్రీడలు లేదా వ్యాయామంలో ఎక్కువ శ్రమపడటం కండరాల ఒత్తిడి, డిస్క్ హెర్నియేషన్, లేదా వెన్ను సమస్యలకు దారితీస్తుంది. వంగడం లేదా తిప్పడం వంటి పనులు కూడా కాలక్రమేణా వెన్నునొప్పిని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి, టెన్షన్
శారిరకంగా జరిగేవే కాకుండా మానసిక ఆరోగ్యం వల్ల కూడా వెన్నెముకపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల ఒత్తిడి వల్ల కండరాలు, ముఖ్యంగా మెడ, భుజాలు, వెన్ను భాగం బిగుసుకుపోతాయట. దీని వల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడికి గురికాకుండా ఉండాలని సూచిస్తున్నారు.
కదలకుండా ఉంటే
ఒకే చోట కదలకుండా ఉంటే వెన్నునొప్పి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కూర్చోకపోయినా, లేదా రెస్ట్ లేకుండా పని చేసినా వెన్ను గట్టిపడి పోయే ప్రమాదం ఉందట. దీంతో వెన్నెముకను సపోర్ట్ చేసే కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. కొన్ని సార్లు ఇవి బలహీనపడే ఛాన్స్ కూడా ఉంటుందట. ఇది కూడా వెన్ననొప్పికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: ఈ కొరియన్ హీరో లాగా మీరు పుష్-అప్స్ చేయలేరు..
వైద్య సమస్యలు
ఆర్థరైటిస్, స్కోలియోసిస్, లేదా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు ఉన్న వారిలో కూడా వెన్నునొప్పి సమస్య ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఇన్ఫెక్షన్లు, మూత్రపిండ సమస్యలు, కడుపులో నొప్పి వల్ల కూడా వెన్నెముకపై ఎఫెక్ట్ పడుతుందట. ఫలితంగా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
నొప్పి నిరంతరంగా ఉంటే ఫిజియోథెరపిస్ట్ లేదా కైరోప్రాక్టర్‌ను సంప్రదించడం మంచిది. నొప్పి తీవ్రంగా ఉంటే లేదా తిమ్మిరి, జ్వరం వంటి ఇతర లక్షణాలతో ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.