చాలామంది జుట్టుకు రంగు వేసేందుకు హెన్నాను వాడుతూ ఉంటారు. దీన్ని సహజమైన రంగుగా భావిస్తారు. శతాబ్దాలుగా దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. సింథటిక్ రంగులతో పోలిస్తే మెహందీ సురక్షితమైనదని, రసాయనాలు కలపని పదార్థమని భావిస్తూ ఉంటారు. అందుకే జుట్టుకు హెన్నా పెట్టుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే దీన్ని అధికంగా వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెహెందీని తరచుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల మాడు పొడిబారిపోతుంది. జుట్టు వెంట్రుకలు కూడా పొడిబారి పోతాయి. హెన్నాలో టానిన్లు ఉంటాయి. ఇవి జుట్టులోని సహజ నూనెలను తొలగించి వెంట్రుకల మొదళ్లను గరుకుగా, పెళుసుగా అయ్యేలా చేస్తాయి. దీనివల్ల ఆ జుట్టు విరిగిపోయి రాలిపోయే ప్రమాదం ఉంది. హెన్నా తరచూ పెట్టడం వల్ల జుట్టుకు ఉన్న సున్నితమైన, మృదువైన ఆకృతి కూడా తగ్గిపోతుంది. చివర్లు విరిగిపోతాయి. చిక్కుబడడం జుట్టు రాలిపోవడం వంటివి కూడా జరుగుతాయి.
జుట్టును గరుకుగా మార్చేస్తుంది
అయితే హెన్నాను తరచూ జుట్టుకు అప్లై చేస్తారో వారి పట్టు లాంటి జుట్టు కూడా ముతకగా, గరుకుగా అయిపోతుంది. హెన్నా జుట్టును మందంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని మరీ అధికంగా వాడితే గడ్డిలాగా అయిపోతుంది. కాబట్టి హెన్నాను కూడా పరిమితంగానే వాడాలి. ఎంత సహజమైనదైనా కూడా దాన్ని అధికంగా వాడితే దుష్ప్రభావాలు కలగక మానదు.
మెహెందీ జుట్టును బలపరుస్తుందని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. కానీ అతిగా వాడితే మాత్రం వ్యతిరేక ప్రభావాలను చూపిస్తుంది. హెన్నా అనేది జుట్టు చివర్లను బలహీనపరిచి, ఎండిపోయేలా చేస్తుంది. పెళుసుగా మారుస్తుంది. దీనివల్ల జుట్టు పలుచగా మారి సన్నబడిపోతుంది. చర్మంలో తేమ, పోషణ నిలుపుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
అలెర్జీలు వచ్చే అవకాశం
కొందరికి మెహెందీ వల్ల కూడా అలెర్జీ కలిగే అవకాశం ఉంది. దీనివల్ల హెన్నా పెట్టుకోగానే మీకు తలపై దురద, దద్దుర్లు ఎక్కువగా అనిపిస్తే మీరు దానికి దూరంగా ఉండాలి. అలాగే డెర్మటాలజిస్టును సంప్రదించి తగిన మందులు కూడా వాడాలి. బయట దొరికే హెన్నాల్లో కొన్ని రకాల రసాయనాలను కూడా కలుపుతూ ఉంటారు. దానివల్లే కొంతమందికి ఇలా అలెర్జిక్ రియాక్షన్లు వస్తూ ఉంటాయి. మీరు ఏదైనా సరే వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. సున్నితమైన చర్మం దగ్గర చిన్న పరిమాణంలో రాసి చూడాలి. అక్కడ మీకు ఎలాంటి రియాక్షన్ కనిపించకపోతేనే మీరు దీన్ని వాడడం కంటిన్యూ చేయాలి.
Also Read: తులసి ఆకులను నమలకూడదని ఎందుకు చెబుతారు?
మెహెందీని తరచుగా వాడితే జుట్టు రంగు కూడా మారిపోతుంది. అసహజంగా, అసమానంగా కనిపిస్తుంది. మెహెందీని పదే పదే వాడితే జుట్టు సహజత్వాన్ని కోల్పోతుంది. దానివల్ల అందం కూడా ఉండదు. చాలామంది జుట్టుకు హెన్నా పెట్టుకున్న తర్వాత దాన్ని కడిగి వేసి సింథటిక్ రంగులతో జుట్టుకు రంగు వేసేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల సమస్యలు ఎక్కువవుతాయి. సహజంగా పెట్టిన హెన్నా… రసాయన రంగులను జుట్టు కుదుళ్లలోకి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. అలాగే మెహెందీ సింథటిక్ రంగులు కలిసి అసహ్యమైన రంగుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి. హెన్నా వాడడం మంచిదే. అయితే వారంలో రెండు మూడు సార్లు హెన్నాను పెట్టుకోకూడదు. కేవలం రెండు వారాలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.