తులసి మొక్కకు హిందూమతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆమెను లక్ష్మీదేవి రూపంగా కొలుస్తారు. ప్రతిరోజూ దీపం పెట్టి పూజలు చేస్తారు. ఆధ్యాత్మికంగా తులసికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలకూడదని చెబుతారు. అయితే సైన్స్ పరంగా చూస్తే మాత్రం తులసి ఆకులను ప్రతిరోజు నమిలి మింగడం వల్ల ఎన్నో ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. కానీ ఆధ్యాత్మికంగా తులసి ఆకులను తినకూడదని ఎందుకు చెబుతారో తెలుసుకుందాం.
తులసిని ఒక మొక్కగా కాకుండా లక్ష్మీదేవి ప్రతిరూపంగా చూస్తారు. తులసి మొక్క ఉన్న ఇల్లు అదృష్టంతో నిండి ఉంటుందని లక్ష్మీదేవి కొలువు ఉంటుందని చెప్పుకుంటారు. అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయని, అనారోగ్యాలు వంటివి కూడా రావని చెబుతారు. తులసి విష్ణువు స్వరూపమైన శాలిగ్రామాన్ని వివాహం చేసుకుందని చెబుతారు.
తులసి మొక్క కథ
తులసి వెనుక ఒక కథ కూడా ఉంది. శంఖచూడుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి బలం ఎక్కువ. అతని భార్య తులసి. ఆమె విష్ణువును భక్తితో పూజించేది. శంఖచూడుడిని ఓడించేందుకు శివుడు కష్టపడతాడు. దానికి విష్ణుడు సాయాన్ని కోరతాడు. శంఖచూడుడిని ఓడించడానికి విష్ణువు అతని రూపాన్నే ధరించి తులసి వద్దకు వస్తాడు. ఆమెను మోసగిస్తాడు. ఆమె పవిత్రతకు భంగం కలిగిస్తాడు. దీంతో శంఖచూడుడు తన దైవిక శక్తిని కోల్పోతాడు. అప్పుడు శివుడు శంఖచూడుడిని ఓడిస్తాడు. తులసి తన దగ్గరకు వచ్చినది విష్ణువు అని, తన భర్త కాదని తెలిసి తీవ్రంగా కుంగిపోతుంది. మోసాన్ని భరించలేక పోతుంది. వెంటనే విష్ణువుని శపిస్తుంది. ఆ తరువాత విష్ణువు తులసి భక్తిని గుర్తించి ఆమె తనతోటే ఎప్పటికీ ఉండేలా పవిత్రమైన మొక్కగా మార్చాడని చెప్పుకుంటారు.
అప్పటినుంచి తులసి లక్ష్మీదేవి రూపంగా మారిందని అనుకుంటారు. తులసిలో ఉన్న ఔషధ గుణాలు ఆయుర్వేదంలో కూడా దాన్ని ఒక ముఖ్యమైన మూలికగా మార్చాలి. తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముందుంటాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. తులసి ఆకులను నమలడం తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.
తులసి ఆకులు ఎందుకు నమలకూడదు?
అయితే తులసి ఆకులను నమలకూడదని మాత్రం ఒక వాదన ఉంది. ఎందుకంటే తులసి ఆకులలో పాదరసం, ఇనుము అధికంగా ఉంటాయి. వీటిని నమిలినప్పుడు నోటిలో ఉన్న దంతాలకు హాని కలగవచ్చు. దంతాల ఎనామిల్ ను కోసేస్తాయని, రంగు మారడానికి కారణం అవుతాయని చెబుతారు. అలాగే తులసి ఆకులలో అధిక మొత్తంలో ఉర్సోలిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది నోటిలో మంటను కలిగిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి తరచూ తులసి ఆకులను నమిలితే దంతాల ఎనామిల్ దెబ్బతింటుందని చెబుతారు.
Also Read: ఈ పాత వస్తువులు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉంచకండి.. ఆ బాధ తట్టుకోలేరు!
ఆధ్యాత్మికపరంగా తులసి ఆకులను నమలకూడదని చెప్పడానికి ప్రధాన కారణం ఆమె లక్ష్మీదేవి స్వరూపం. ఆకులను తెంపి నమలడం వల్ల లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టుగా భావిస్తారు. తులసి ఆకులలో లక్ష్మీమాత శక్తి ఉంటుంది. వాటిని నమలడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు. తులసి ఆకులను పవిత్ర జలాలలో ఉంచుతారు. ప్రసాదం నైవేద్యాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వాటిని నమలకుండా నేరుగా మింగేయటమే ఉత్తమం. నమిలితే లక్ష్మీదేవిని అవమానించినట్టేనని అంటూ ఉంటారు. కాకపోతే తులసి ఆకులను నుండి రసాన్ని తీసి ఆ రసాన్ని మాత్రం తాగవచ్చు. కానీ నోట్లో తులసి ఆకులను వేసి నమలకూడదని మాత్రం చెబుతూ ఉంటారు.