BIG TV LIVE Originals: COVID-19 వ్యాధి SARS-CoV-2 అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఆయా వ్యక్తుల బ్లడ్ గ్రూప్స్ ఆధారంగా ఈ వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. A, B, AB, O బ్లడ్ గ్రూప్స్ లో కొన్నింటిలో COVID-19 తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటే, మరికొన్నింటిలో తక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు తేల్చారు.
ఏ బ్లడ్ గ్రూప్ మీద ఎంత ప్రభావం?
కోవిడ్-19 తీవ్రత, బ్లడ్ గ్రూప్ మధ్య సంబంధంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరిగాయి. వాటి ఫలితాలు మాత్రం కాస్త వైరుధ్యంగా ఉన్నాయి. సాధారణంగా గమనించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ బ్లడ్ గ్రూప్ A: పలు అధ్యయనాల ప్రకారం.. బ్లడ్ గ్రూప్ A ఉన్నవారికి కోవిడ్-19 సోకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. SARS-CoV-2 వైరస్ శ్వాసకోశ కణాలలోని A గ్రూప్ యాంటిజెన్ లపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. 2023లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ గ్రూప్ వాళ్లు సుమారు 20 నుంచి 30 శాతం ఎక్కువ సంక్రమణ ముప్పును కలిగి ఉన్నట్లు తేల్చింది.
⦿ బ్లడ్ గ్రూప్ AB: కొన్ని అధ్యయనాల ప్రకారం.. AB గ్రూప్ వారికి కూడా సంక్రమణ ముప్పు ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. తీవ్రమైన లక్షణాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. కెనడాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, AB గ్రూప్ వారికి ICUలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
⦿ బ్లడ్ గ్రూప్ B: B గ్రూప్ ఉన్న వారికి కొంత తక్కువ ప్రభావం ఉన్నట్లు పరిశోధనలు తేల్చాయి. A, ABతో పోలిస్తే కోవిడ్-19 ప్రభావం తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కొన్ని అధ్యయనాలు B గ్రూప్ వారికి ఇంట్యూబేషన్ ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, మరణ ప్రమాదం తక్కువగా ఉందని వెల్లడించారు.
⦿ బ్లడ్ గ్రూప్ O: బ్లడ్ గ్రూప్ O ఉన్నవారికి సంక్రమణ, తీవ్రమైన లక్షణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ గ్రూప్ లో యాంటీ-A యాంటీ బాడీలు వైరస్ ను నిరోధించడంలో సాయపడుతున్నట్లు గుర్తించారు. డెన్మార్క్‌లో జరిగిన ఒక అధ్యయనం O గ్రూప్ వారిలో కోవిడ్-19 సంక్రమణ రేటు తక్కువగా ఉందని కొనుగొనబడింది.
⦿ Rh ఫ్యాక్టర్: Rh- నెగటివ్ ఉన్నవారికి సంక్రమణ, ఇంక్యూబేషన్, మరణ ప్రమాదం Rh-పాజిటివ్ వారి కంటే తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
నిపుణులు ఏం చెప్తున్నారంటే?
ఆయా అధ్యయనాలు కొన్ని బ్లడ్ గ్రూప్స్ తో పలు సంబంధాలను సూచిస్తున్నప్పటికీ, వయసు, ఊబకాయం, గుండె జబ్బు, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కోవిడ్ తీవ్రతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి వైద్య నిపుణులు వెల్లడించారు. హార్వర్డ్ డాక్టర్ సీన్ స్టోవెల్ లాంటి వాళ్లు బ్లడ్ గ్రూప్ అనేవి కరోనా విషయంలో నామమాత్రపు పాత్ర పోషిస్తాయని తెలిపారు. సో, బ్లడ్ గ్రూప్ ఒక్కటే కోవిడ్-19 ప్రమాదాన్ని నిర్ణయించదు. టీకాలు తీసుకోవడం, మాస్క్ ధరించడం, శుభ్రత పాటించడం అన్ని బ్లడ్ గ్రూప్‌ల వారికీ మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు. బ్లడ్ గ్రూప్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.