Saudi Arabia Alcohol Ban| ఇస్లాం పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియా దేశంలోనూ ఇకపై మద్యం విక్రయాలు ప్రారంభంకానున్నాయి. మతపరంగా ముస్లింలు మద్యం సేవించకూడదు. ఇలా చాలా కఠిన నిబంధన. కానీ 73 ఏళ్లుగా మద్య పాన నిషేధం కొనసాగుతున్న సౌదీ అరేబియా దేశంలో ప్రభుత్వం ఇకపై విక్రయాలకు అనుమతించే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది.
గత వారం ఒక వైన్ బ్లాగ్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 2034 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను నిర్వహించడానికి సిద్ధమవుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వం.. నిషేధం ఉన్నా మద్యం విక్రయానికి అనుమతించే యోచనలో ఉందని తెలిపింది. కానీ ఈ నివేదిక ఎలాంటి అధికారిక మూలాన్ని పేర్కొనలేదు.. అయితే అంతర్జాతీయ మీడియా మాత్రం దీనిని విస్తృతంగా ప్రసారం చేసింది. ఈ వార్త దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది, ఎందుకంటే సౌదీ అరేబియా రాజును ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ.. మక్కా, మదీనాలలోని ఇస్లామ్ పవిత్ర స్థలాల సంరక్షకుడిగా కూడా భావిస్తారు. అందుకే మద్య పానం, ఇస్లాం ప్రకారం.. నిషేధిత అయిన ఇతర వస్తువులు, ఆచారాలను దూరంగా ఉంటారు. వాటిపై దేశంలో నిషేధం విధిస్తారు.
కానీ మరోవైపు ఎంబీఎస్ గా పిలవబడే.. సౌదీ అరేబియా యువరాజు(తదుపరి రాజు) మహ్మద్ బిన్ సల్మాన్ దేశాన్ని పర్యాటకం, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు అనేక సంస్కరణలను చేపడుతున్నారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను చమురు రంగంపై ఆధారపడకుండా బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. ఈ నేపథ్యంలో ఆయన దేశంలో కారు డ్రైవింగ్ చేయకూడదని మహిళలపై ఉన్న నిషేధాన్ని 2017లో రద్దు చేశారు. ప్రజా స్థలాల్లో లింగ విభజన నియమాలను సడలించారు. ఆ దేశంలో సమయానికి నమాజు వెళ్లకపోయినా.. లేదా ఇస్లాం నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించినా.. మత పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. ఇలా చాలాకాలంగా జరుగుతోంది కానీ ఇప్పడు ఆ మత పోలీసుల అధికారాన్ని తగ్గించడం వంటి మార్పులు జరిగాయి.
దేశంలో మద్య పానం నిషేధాన్ని గత సంవత్సరమే పాక్షికంగా సౌదీ ప్రభుత్వం ఎత్తివేసింది. రాజధాని నగరమైన రియాద్‌లో మొట్టమొదటి మద్యం దుకాణం తెరవబడింది. ఈ దుకాణంలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తలకు మాత్రమే అనుమతి ఉంది. ఇంతకు ముందు.. సౌదీ దేశంలో మద్యం కేవలం దౌత్యవేత్తలకు మెయిల్ ద్వారా లేదా సామాన్యులకు బ్లాక్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. సౌదీ అరేబియాలో నిషేధం ఉన్నా మద్యపాన సేవించి ఉల్లంఘలనలక పాల్పడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. దేశం నుండి బహిష్కరణ, జరిమానా లేదా జైలు శిక్ష విధించబడవచ్చు. గతంలో, కొరడా దెబ్బల శిక్ష కూడా ఉండేది, కానీ ఇప్పుడు జైలు శిక్షలు ఎక్కువగా విధిస్తున్నారు.
Also Read: 60 ఏళ్ల వయసులో చనిపోతాడనకుంటే.. 102 ఏళ్లకు ఫిట్‌నెస్ రికార్డులు
ఈ నివేదిక సౌదీ సమాజంలో భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. కొందరు ఈ మార్పులను దేశం ఆధునీకరణ దిశగా ఒక అడుగుగా భావిస్తుండగా, మరికొందరు ఇస్లామిక్ విలువలకు విరుద్ధమని వాదిస్తున్నారు. 2034 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ చర్చలు మరింత తీవ్రమవుతాయని భావిస్తున్నారు. దేశం సాంస్కృతిక, మతపరమైన విలువలను కాపాడుతూనే ఆధునిక ప్రపంచంతో సమతుల్యత సాధించడం ఇప్పుడు సౌదీ అరేబియాకు పెద్ద సవాలుగా మారింది.