40 Years once rice: పల్లె రైతు పొలాల్లో కనిపించే పచ్చని వరి పొలాలు, వాటిలో పండే బియ్యం మనకు చాలా సార్లు చూసినవే. కానీ.. ఓ బియ్యం ఉంది.. అది గడ్డి తోటలో కాదు, అడవుల మధ్య పుట్టే వింత వరి. దాని పేరు బాంబో రైస్. ఇది ఏటా పండేది కాదు.. దాదాపు 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే పండుతుంది! వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇదే నిజం.
బాంబో రైస్ అంటే నిజానికి బాంబూ చెట్టులో ఏర్పడే విత్తనం. బాంబూ చెట్లు తమ జీవితాంతం ఎదిగి చివర్లో చనిపోతున్న సమయంలో.. అంటే దాదాపు 30 నుంచి 45 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే పుష్పిస్తాయి. ఆ పుష్పాల ద్వారా ఏర్పడే విత్తనాలే ఈ బాంబో రైస్. ఇవి మనం తినే సాధారణ బియ్యంలా కాకుండా, ఆకారంలో చిన్నగా, రంగులో కొంచెం తెల్లగా, రుచిలో మాత్రం కొద్దిగా చేదుగా ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఇందులో దాగి ఉన్న గుణాలు మాత్రం చాలా గొప్పవి.
బాంబో రైస్ సాధారణంగా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా సేకరిస్తారు. వీరికి ఇది బంగారం లాంటిదే.. అందుకే వీరు దీనిని అడవి బంగారం అని కూడా పిలుస్తారు. ఈ బియ్యంలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, శక్తి కోసం దీనిని వారు ప్రత్యేకంగా వండుకుని తింటారు.
ఇక ఈ బాంబో రైస్ వెనుక కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. బాంబూ చెట్లు ఒకేచోట పెద్ద మొత్తంలో పుష్పించడాన్ని Mass Flowering అంటారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. వందలాది చెట్లు ఒకేసారి పుష్పించి, విత్తనాలను ఉత్పత్తి చేస్తే… తర్వాత అవి చనిపోతాయి. అదే సమయంలో ప్రకృతిలో ఈ విత్తనాలను ఏనుగులు, అడవి పంది వంటి జంతువులు కూడా తినేందుకు వస్తాయి. ఈ తిండి కోసం అటవీ ప్రాంతాల్లో జంతు చలనం కూడా పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ బాంబో రైస్ పెరగడం వల్ల జంతు దాడులూ సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అంతటి శక్తివంతమైన ఆకర్షణ ఇది.
బాంబో రైస్ తినడానికి కొంచెం చేదుగా ఉన్నా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొంత మంది దీన్ని పొడిగా వేసుకుని వడలు, రొట్టెలు చేసుకుంటారు. మరికొందరు పాయసం లాంటి ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు. కొంతమంది ఆయుర్వేదం శాస్త్రంలో దీన్ని ఔషధంగా కూడా పేర్కొన్నారు.
ఇప్పటివరకు మనం బియ్యం అంటే పొలాల్లో పండే పంటగా మాత్రమే ఊహించాం. కానీ బాంబో రైస్ వంటి వింత వరి మనకు ప్రకృతి అందించిన ఓ అరుదైన కానుక. ఇది వాడే ప్రాంతాల్లో ప్రజలు దాన్ని ఎంత గౌరవంగా చూస్తారంటే.. ఏదైనా శుభకార్యంలో, పండుగలప్పుడు దీన్ని ప్రత్యేకంగా వండుతారు. ఎవరికైనా బలహీనత, శక్తి లోపం ఉన్నా, దాన్ని తినమంటారు. అటవీ ప్రజల సంప్రదాయంలో ఇది ఒక గొప్ప సంపదగా ఉంది.
ఇప్పుడిది అడవుల్లో పుట్టే విత్తనంగా ఉన్నా, దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీన్ని పరిశోధకులు, పోషకాహార నిపుణులు కొత్తగా అధ్యయనం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బాంబో రైస్ ఆధారంగా నూతన ఆహార పదార్థాలు తయారయ్యే అవకాశం ఉంది.
అంతేకాదు.. వాడకం క్రమంగా పెరుగుతే, ఇది వాణిజ్యోద్దేశాలకూ ఉపయోగపడవచ్చు. కానీ 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే దొరికే ఈ బియ్యాన్ని సేకరించడం అంటే పెద్ద కష్టమే. అందుకే ఇది మరింత విలువైనదిగా మారుతుంది. బాంబో రైస్.. అద్వితీయమైన బియ్యం, అరుదైన అవకాశం, ఆరోగ్యానికి ఆస్తి. ఇది కేవలం ఆహారం కాదు.. ప్రకృతి మనకు చెప్పే ఓ జీవన పాఠం.
Note: ఈ కథనం పలువురు ఆదివాసీల ద్వారా సేకరించి రాసిన కథనం. ముందుగా మీరు ఈ బియ్యం గురించి, వైద్యుల నిర్ధారణ తీసుకొని భుజించండి.