Amazing Railway Tracks: ప్రపంచంలో రైలు ప్రయాణం అంటే వేగం, సౌకర్యం మాత్రమే కాదు.. ఏకంగా ఆశ్చర్యానికి మారుపేరు కూడా. కొన్నిచోట్ల ట్రైన్ రోడ్డు మీదే వెళ్లిపోతుంది, మరికొన్నిచోట్ల ఇంటి మధ్యగదిలోంచే రైలు వెళ్తుంది. ఇవే కాక, రైలు వచ్చిందంటే మార్కెట్ మూసి, వెళ్లాక మళ్లీ ఓపెన్ చేసే అపూర్వమైన ట్రాకులు కూడా ఉన్నాయి. ఇలా వింటుంటే వింతగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ నిజం. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతమైన, వింతైన రైల్వే ట్రాక్‌ల గురించి తెలుసుకుందాం.
థాయ్‌లాండ్.. మార్కెట్ మీదుగా వెళ్తున్న ట్రైన్!
థాయ్‌లాండ్‌లోని మెఖాంగ్ మార్కెట్ (Maeklong Railway Market) ప్రపంచంలోనే అద్భుతమైన రైల్వే ట్రాక్‌లలో ఒకటి. ఇది సాధారణ మార్కెట్‌లా కాకుండా రైల్వే ట్రాక్ మీదే మార్కెట్ ఏర్పాటైంది. మీరు ఊహించండి.. పండ్లు, కూరగాయలు, పూలు అన్నీ ట్రాక్ పక్కన పెట్టి అమ్ముతున్నారు. కానీ రైలు వచ్చిందంటే? ఆ విక్రేతలు అటు పక్కకి సరికి, కొట్లు మూసేస్తారు. ట్రైన్ వెళ్లిన వెంటనే మళ్లీ ఓపెన్ చేసి వ్యాపారం కొనసాగిస్తారు. ఇది ప్రతిరోజూ జరిగే మామూలే. ట్రైన్ షెడ్యూల్ ప్రకారం విక్రేతల జీవితాలే మారిపోయాయి. దీన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు.
ట్రాక్ లెస్ ట్రైన్.. రోడ్డుమీదే రైలు నడుస్తుంది!
చైనాలో కొత్తగా ఆవిష్కరించిన మరో అద్భుతం.. ట్రాక్‌లెస్ ట్రైన్. ఇది బయటకు చూస్తే రైలే కానీ, ఇది ట్రాక్ మీద కాదు.. రోడ్డుపై టైర్లతో నడిచే ప్రత్యేక వాహనం. దీనిని Autonomous Rail Rapid Transit అంటారు. ఇది రోడ్డుపై ముందుగా అమర్చిన వర్చువల్ ట్రాక్‌ను ఫాలో అవుతుంది. డ్రైవర్‌కి అవసరం లేదు, స్వయంచాలకంగా కదులుతుంది. ఎలక్ట్రిక్ సాంకేతికంతో తయారైన ఈ ట్రైన్.. ట్రైన్ వేగం, బస్సు సౌకర్యం, మెట్రో స్టైల్ అంటారు. అంతేకాదు, ట్రాక్ నిర్మాణం లేకుండా ఉండటంతో ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ సులభం.
ఇల్లు మధ్యలో ట్రైన్.. చైనాలో రైలు భవనంలోంచి వెళ్తుందా?
రెండో షాక్ ఏంటంటే, చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఓ భవనం మధ్యలో నుంచే రైలు వెళ్తుంది. 19 అంతస్థుల అపార్ట్‌మెంట్‌లో 6వ, 7వ ఫ్లోర్ల మధ్యుగా రైల్వే ట్రాక్ వేసిన ఈ విజ్ఞాన అద్భుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ట్రైన్ బయట కాకుండా భవనం లోపలదే.. కానీ శబ్దం తగ్గించేందుకు స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించారని చెబుతున్నారు. అక్కడ భూమి కొరత కారణంగా భవనాన్ని కదిలించకుండా, ట్రైన్‌నే భవనం లోపలికే తీసుకెళ్లిన సంఘటన ఇది. చైనాలో స్థలం లేకుండా ఉన్నా, పరిష్కారం మాత్రం క్రియేటివ్‌గా కనిపించింది.
ఇలాంటి వింతలు మనదేశంలో ఉండవా?
మన భారత్‌లోనూ డెంజర్ జోన్ గా పిలిచే కొన్ని రైల్వే మార్గాలు ఉన్నాయి. వాటిలో కనపడని సొరంగాలు, కొండల మీద సాగే ట్రాకులు, గాలిలో వేలాడే బ్రిడ్జిలూ ఉన్నాయి. అయితే ట్రైన్ ఇంట్లోంచో, మార్కెట్ మద్యో వెళ్లే ట్రాక్‌లు మనదేశంలో చూడటం సాధ్యం కాదు. కానీ భవిష్యత్తులో ట్రాఫిక్, స్థల కొరత కారణంగా ఇలాంటి వినూత్న ఆలోచనలు ఇక్కడా రావచ్చు.
ఇకపోతే, రైలు అంటే మనకెంతో సాదాసీదా ప్రయాణ అనిపించొచ్చు.. కానీ కొన్ని దేశాల్లో అది విస్మయం, వినూత్నతకి రూపం. ప్రపంచం ఎటు వెళ్తుందో, రైలు మార్గాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైన్ రోడ్డు మీద నడవడం, ఇంట్లోంచి వెళ్లడం, మార్కెట్‌కి మధ్యనుండి పోవడం.. ఇవన్నీ ఊహల్లో కాదు, నిజంగా జరుగుతున్న అద్భుతాలు.