Beauty Treatment Glutathione| ఇటీవలే బాలీవుడ్ నటి-మోడల్ షెఫాలీ జరివాలా అకాల మరణం భారతదేశంలో అందం, యవ్వనం, తెల్లని చర్మం పట్ల ఉన్న ఆకర్షణపై కీలక చర్చను రేకెత్తించింది. ఆమె మరణం వెనుక ఎన్నో ప్రశ్నలు ఉండగా, ఒక విషయం దృష్టిని ఆకర్షించింది. అదే చర్మం తెల్లబడేందుకు, యాంటి ఏజింగ్ (వయసు తగ్గించే) చికిత్సలను ఆమె ఎనిమిది సంవత్సరాలుగా వైద్య పర్యవేక్షణ లేకుండా ఉపయోగించడం. ఆమె గదిలో యాంటీ-ఏజింగ్ మాత్రలు, మల్టీవిటమిన్లుర, గ్లూటాథియోన్ వైల్స్ డ్రాయర్లలో, టేబుల్ మీద, ఫ్రిజ్‌లో కూడా కనిపించాయి.
గ్లూటాథియోన్, విటమిన్ సి ఎందుకు హైలైట్‌లో ఉన్నాయి?
భారత్‌లో గ్లూటాథియోన్, విటమిన్ సి చాలా ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే ఇవి చర్మాన్ని తెల్లగా మార్చడం, మచ్చలను తగ్గించడం, యవ్వన లక్షణాలను కాపాడతాయని చెబుతారు. ఇవి మాత్రలు, ఇంజెక్షన్లు, ఇంట్రావీనస్ (IV) డ్రిప్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. 2025లో గ్లూటాథియోన్ మార్కెట్ విలువ 324.6 మిలియన్ డాలర్లుగా ఉంది. 2032 నాటికి ఇది 585.8 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కానీ, ఈ చికిత్సల దీర్ఘకాలిక ఉపయోగం గురించి వైద్య పరిశోధనలు చాలా తక్కువ. ఈ చికిత్సలు ప్రమాదరహితం కాదు. అలర్జీలు, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు. స్వీయ-మందుల వాడకం కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు.
అందం, యవ్వనం కోసం అన్వేషణ
ఆరోగ్య ప్రమాదాలతో పాటు, గ్లూటాథియోన్ చికిత్సల ఖర్చు కూడా భారీగా ఉంది. ఈ చికిత్సల ధరలు ఇలా ఉన్నాయి.
గురుగ్రామ్‌లో: ఒక సెషన్ ధర రూ. 4,000 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది. ఎక్కువ డోసేజ్ లేదా ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ధరలు మరింత ఎక్కువ. కొన్ని క్లినిక్‌లు ప్యాకేజీలను అందిస్తాయి, ఇవి కొంచెం తక్కువ ఖర్చుతో ఉంటాయి.
ఢిల్లీలో: ఒక సెషన్ రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు. 5 సెషన్‌ల ప్యాకేజీ రూ. 35,000, 10 సెషన్‌ల ప్యాకేజీ రూ. 60,000 వరకు ఉంటుంది. కొన్ని క్లినిక్‌లు చర్మ అవసరాల ఆధారంగా కస్టమైజ్డ్ ప్యాకేజీలను అందిస్తాయి, కానీ ధర కూడా పెరుగుతుంది.
ముంబైలో: ఒక సెషన్ రూ. 8,000 నుంచి ప్రారంభమవుతుంది, ఇంట్లో సేవ కోసం శిక్షణ పొందిన వైద్య నిపుణులతో సహా. 6 సెషన్‌ల ప్యాకేజీ రూ. 38,400, 18 సెషన్‌ల ప్యాకేజీ రూ. 1,08,000 వరకు ఉంటుంది.
ఆన్‌లైన్ ఆప్షన్స్‌తో ప్రమాదం
కొందరు స్వీయ-చికిత్స కోసం గ్లూటాథియోన్, విటమిన్ సి మాత్రలను కొంటారు. 600 మి.గ్రా. ఉన్న 30 మాత్రల ప్యాక్ (రెండు ట్యూబ్‌లలో 15 చొప్పున) రూ. 5,000 ఉంటుంది. ఇంజెక్షన్ కిట్‌లు ఒక వైల్‌తో రూ. 7,800 ఖర్చు అవుతుంది. కానీ, ముంబై డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుజిత్ షాన్షన్వాల్ హెచ్చరిస్తూ.. ఈ స్వీయ-చికిత్సలు సురక్షితం కాదని, దుష్ప్రభావాలు రావచ్చని చెప్పారు. ఈ చికిత్సల సమయంలో నిపుణుల పర్యవేక్షణ అవసరమని, సలోన్‌లలో ఈ చికిత్సలు తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు.