Heart Attack: దేశంలో హార్ట్ఎటాక్‌లు కలకలం రేపుతున్నాయా? ఒకప్పుడు 60 ఏళ్ల దాటినివారికే వచ్చేవి. ఇప్పుడు చిన్నవయస్సులో గుండెపోటు రావడం వెనుక కరోనా వ్యాక్సిన్ కారణమా? దాని తర్వాత ఆకస్మిక మరణాలు పెరిగాయా? కర్ణాటక ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసిన అంశాలపై కేంద్రం ఏం చెప్పింది? ఇంకాస్త లోతుగా వెళ్తే..
దేశంలో కరోనా వైరస్ తర్వాత ఆకస్మిక మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనిబారిన పడి యువకులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. 40 ఏళ్ల లోపు వారు కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోతుండటం గుబులు మొదలైంది. గుండెపోటు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఒకే జిల్లాలో గడిచిన 40 రోజుల్లో 24 మంది గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రభుత్వానికి అనుమానం మొదలైంది. ఆకస్మిక మరణాల వెనుక నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ 10 రోజల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
జూన్‌లో హసన్ జిల్లాలో 24 మంది యువకులు గుండెపోటుతో మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు, పరిష్కారం చూపాలంటూ జయదేవ హృద్రోగ ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్‌ను ఆదేశించారు సీఎం. దీనిపై ఎక్స్ వేదికగా సీంఎం సిద్ధ రామయ్య ఓ పోస్ట్ చేశారు. యువకుల్లో ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేయాలని నాలుగు నెలల కిందట ఆదేశాలు జారీ చేశామని రాసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్-ఎయిమ్స్ వంటి సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. గుండెపోటు మరణాలకు-కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి. అనారోగ్య సమస్యల వల్లే ఆయా వ్యక్తుల మరణాలకు కారణమని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారిలో వచ్చిన గుండెపోటు మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్-ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి.
ALSO READ: ఇంట్లోనే కొబ్బరి కారం ఇలా చేసుకున్నారంటే ఓ రేంజ్‌లో
రెండేళ్ల కిందట మే నుంచి ఆగస్టు నెలల మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేశాయి. ముఖ్యంగా ల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఈ సర్వేను చేశాయి. ఈ క్రమంలో 2021 నుంచి 2023 వరకు అంటే అక్టోబరు నుంచి మార్చి మధ్య మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు పేర్కొన్నాయి.
జన్యుపరంగా, జీవనశైలి, కోవిడ్ తర్వాత అనేక రకాల కారణాల వల్ల ఆకస్మిక గుండె మరణాలు సంభవించవచ్చని తెలిపాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గుండె మరణాల వెనుక కోవిడ్ వ్యాక్సిన్‌లు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఒక రోజు తర్వాత కేంద్ర ఆరోగ్య విభాగం ఈ ప్రకటన వెలువడింది. ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చేసింది కేంద్రం. ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారాలు చేస్తే వ్యాక్సిన్ల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపాయి. కొవిడ్ సమయంలో టీకాల వల్లే ఎంతో మంది ప్రాణాలు దక్కాయని గుర్తు చేశాయి.