Foot Massage: రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసుకోవడం వల్ల కేవలం రిలాక్సేషన్ మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ? అలసిన పాదాలకు లభించే ఉపశమనం నుండి మెరుగైన నిద్ర వరకు, పాదాల మసాజ్ మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం. పాదాలకు మసాజ్ చేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.మెరుగైన రక్త ప్రసరణ:
రోజువారీ పనులు, నిలబడటం లేదా కూర్చోవడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇలాంటి సమయంలోనే పడుకునే ముందు పాదాలను మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది పాదాలకు, కాళ్ళకు ఆక్సిజన్, పోషకాలను సమర్థవంతంగా చేరవేయడానికి సహాయపడుతుంది. తద్వారా అలసట తగ్గుతుంది.
2.నొప్పుల నుండి ఉపశమనం:
ముఖ్యంగా రోజంతా నిలబడి పనిచేసే వారికి లేదా ఎక్కువ దూరం నడిచే వారికి పాదాలలో నొప్పి రావడం సాధారణం. పాదాలకు మసాజ్ చేయడం వల్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అంతే కాకుండా నరాల ఒత్తిడి కూడా తగ్గుతుంది. నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాలలో ఉండే కొన్ని ప్రెషర్ పాయింట్స్‌ను మసాజ్ చేయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల నొప్పులు కూడా తగ్గుతాయని అంటారు
3.మంచి నిద్ర:
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి పాదాల మసాజ్ ఒక అద్భుతమైన పరిష్కారం. మసాజ్ శరీరంలో విశ్రాంతిని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. అంతే కాకుండా ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను శాంతపరచి, ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
4. ఒత్తిడి, ఆందోళన :
పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. అంతే కాకుండా సెరోటోనిన్, డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఆందోళన, నిరాశ భావనలను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.
5. పాదాల ఆరోగ్యం:
పాదాల మసాజ్ కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా పాదాల కదలికను మెరుగుపరుస్తుంది. ఇది పాదాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే.. మసాజ్ సమయంలో లోషన్ లేదా నూనెను ఉపయోగించడం వల్ల పాదాల చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. పగుళ్లు రాకుండా నివారిస్తుంది.
Also Read: మామిడి ఆకులను ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?
6. పాదాలకు సంబంధించిన సమస్యల నివారణ:
పాదాలలో రక్త ప్రసరణ పెరగడం వల్ల పాదాల తిమ్మిర్లు, జలదరింపు వంటి సమస్యలు తగ్గుతాయి. పాదాల మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచి, నరాల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
7.ఎనర్జీ లెవల్స్ మెరుగుపడతాయి:
పడుకునే ముందు పాదాల మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఇది మరుసటి రోజు ఉదయం మీరు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా నిద్రలేవడానికి సహాయపడుతుంది.
రాత్రి పడుకునే ముందు ఐదు నుండి పది నిమిషాల పాటు మీ పాదాలకు మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మీ రోజువారీ రొటీన్‌లో ఒక సులభమైన, ప్రభావవంతమైన చిట్కాగా ఉపయోగపడుతుంది.