First Corona Deth: కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పంజా విసురుతుంది. భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జోనోమిక్స్ కన్సార్టియం తెలిపింది. ఎన్‌బీ.1.8.1 రకం కేసులు ఏప్రిల్‌లో నమోదవగా.. ఎల్‌ఎఫ్.7కు కేసులు మేలో గుర్తించారు.
ప్రజలు భయాందోళన చెందుతున్న వేళ.. శనివారం బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు అయిందని.. కర్ణాటక ఆరోగ్యశాఖ తాజాగా అధికారిక ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో ఇప్పటివరకు 46 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో 32 బెంగళూరులో నమోదు అయ్యాయని వెల్లడించింది.
ఇప్పటికే ఏపీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రభుత్వాస్పత్రులను అప్రమత్తం అయ్యాయి. కేసులు నమోదవుతున్నా.. తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సింగపూర్‌లో ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉంది.
జేఎన్.1 వేరియంట్ లక్షణాలు:
వైరస్ సోకినవాళ్లలో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
కాగా ఇటీవల హైదరాబాద్‌లో తొలి కొవిడ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. విశాఖలో 28 ఏళ్ల మహిళను పరీక్షించగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు.. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా కొవిడ్ టెస్ట్‌లు చేశారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
కొవిడ్ కేసులు బయటపడటంతో.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక కొవిడ్ వార్డ్‌ను ఏర్పాటు చేశారు. కొవిడ్ టెస్ట్ కిట్‌లతో పాటు ట్రీట్‌మెంట్స్‌కు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. కేరళలో ఇప్పటి వరకు 182 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 106, తమిళనాడులో 78, కర్నాటకలో 46 కేసులు నమోదయ్యాయి. ఇటు పాండిచ్చేరిలో 12, ఏపీలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి.
Also Read: దడ పుట్టిస్తున్న కరోనా వైరస్..! ఒక్క రోజులో ఇన్ని కేసులా..?
కరోనా కేసులు నమోదవుతుండటంతో.. ప్రభుత్వం అలర్టయ్యింది. ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యశాఖను అప్రమత్తం చేసింది. కరోనా వార్డులను రెడీ చేయాలని సూచించింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఆరోగ్యశాఖ. కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది. మాస్కులు ధరించడం మంచిదని చెప్పింది.