Burning In Urine| మూత్ర విసర్జన సమయంలో మంట, అసౌకర్యం కలగడం సాధారణ విషయం కాదు. వైద్య నిపుణుల ప్రకారం.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (మూత్ర నాళంలో ఇన్‌ఫెక్షన్ – UTI) దీనికి కారణం కావచ్చు. ఈ సమస్య స్త్రీలు, పురుషులు.. ఇరువురిలో సాధారణం. యుటిఐ (UTI) వల్ల కలిగే మంట అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అధ్యయనాల ప్రకారం, 40 శాతం మంది స్త్రీలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా UTI సమస్యను ఎదుర్కొంటారు, మరో 20 శాతం మంది రెండుసార్లు ఎదుర్కొంటారు. చాలా సమయాల్లో యుటిఐ చికిత్సకు యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. కానీ కొన్ని సహజసిద్ధమైన పానీయాలు కూడా ఉపశమనం కలిగిస్తాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి.
క్రాన్‌బెర్రీ జ్యూస్
క్రాన్‌బెర్రీ రసం రుచికరంగా ఉండడమే కాకుండా.. బ్లాడర్, యుటిఐ (UTI) సమస్యల నివారణకు సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రకారం.. చక్కెర లేని క్రాన్‌బెర్రీ రసంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రాన్ని ఆమ్ల స్వభావంగా మార్చి, ఎస్చెరిచియా కోలై వంటి బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి.
బార్లీ వాటర్
బార్లీ వాటర్ సమతుల ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది యుటిఐ, డయాబెటిస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ చల్లని పానీయం పేగులు, మూత్ర నాళాల నుండి విష పదార్థాలను బయటకు పంపి, శరీరం లోపలి వ్యవస్థలను శుభ్రపరుస్తుంది. బార్లీలోని బీటా-గ్లూకాన్స్ అనే షుగర్ సమూహాలు డైయూరెటిక్‌గా పనిచేస్తాయి.
గ్రీన్ జ్యూస్
పాలకూర, తులసి, క్యాబేజీ ఆకులతో తయారు చేసిన గ్రీన్ జ్యూస్ ఒక గొప్ప డైయూరెటిక్. ఉదయం దీనిని తాగడం వల్ల బ్లాడర్‌లోని బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో వాపును తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇది UTI చికిత్సకు అద్భుతమైన పానీయం.
నిమ్మకాయ, తేనె నీరు
నిమ్మకాయ, తేనె రెండూ.. UTI చికిత్సలో చాలా ఉపయోగకరం. విటమిన్ సి, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండిన ఈ పానీయం విష పదార్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనెలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పుచ్చకాయ, ఆరెంజ్ రసం
ఇంట్లో తయారు చేసిన పుచ్చకాయ, ఆరెంజ్ రసంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రసం సహజ డైయూరెటిక్‌గా పనిచేసి, యుటిఐకి కారణమయ్యే హానికర బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది.
Also Read: పురుషుల్లో పెరిగిపోతున్న ఎముకల బలహీనత సమస్య.. కారణం అదేనంటున్న నిపుణలు
ఆపిల్ సైడర్ వినెగర్
మూత్ర విసర్జనలో మంట నుండి ఉపశమనం పొందడానికి, ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వినెగర్ కలిపి ప్రతి ఉదయం తాగండి. ఇది మూత్రాన్ని ఆమ్ల స్వభావంగా మార్చి, ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ సహజ పానీయాలు UTI లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి, కానీ తీవ్రమైన సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం మంచిది.