ఎడారి దేశాల ప్రజలు ఒంటెలను ఎన్నో రకాలుగా వినియోగిస్తారు. రవాణాతో పాటు మాంసం కోసం ఉపయోగిస్తారు. అంతేకాదు, ఒంటె మూత్రాన్ని దివ్యౌషధంగా వాడుతున్నారు. ముఖ్యంగా ఇరాక్, జోర్డాన్, అరేబియా ద్వీపకల్పం లాంటి మిడిల్ ఈస్ట్ ప్రాంతాల ప్రజలు చాలా కాలంగా ఒంటె మూత్రాన్ని సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. కడుపులో సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు, క్యాన్సర్ లాంటి తీవ్రమైన జబ్బులు కూడా ఒంటె మూత్రంతో తగ్గిపోతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇంతకీ ఒంటె మూత్రం గురించి సైన్స్ ఏం చెప్తుంది? ఒంటె మూత్రం తాగితే సురక్షితమేనా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒంటె మూత్రాన్ని ఔషధంగా ఉపయోగించడం మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా పాత పద్ధతి. ముఖ్యంగా బెడౌయిన్ కమ్యూనిటీలు, కొన్ని ఇస్లామిక్ సమూహాలు ఒంటి మూత్రాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ప్రాంతాలలోని ప్రజలు ఒంటె మూత్రాన్ని నేరుగా తాగుతారు. మరికొన్నిసార్లు పాలలో కలిపి తాగుతారు. ఇది వారి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది భావిస్తున్నారు. తీవ్రమైన వ్యాధుల చికిత్సలో సాయం చేస్తుందని నమ్ముతారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుందంటున్నారు. ఒంటెలు కఠినమైన ఎడారులలో జీవించే బలమైన జంతువులు కాబట్టి, వాటి మూత్రానికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని కొందరు భావిస్తారు.
ఇక ఒంటె మూత్రం నిజంగా ఔషధంగా పని చేస్తుందో? లేదో? అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో ఫలితాలు అంత పాజిటివ్ గా లేవు. 2015లో జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో వచ్చిన అధ్యయనాల ప్రకారం, ఒంటె మూత్రం వ్యాధులను నయం చేస్తుందని రుజువులు చాలా తక్కువగా ఉన్నాయని చూపిస్తున్నాయి. క్యాన్సర్, చర్మ సమస్యలను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టమైన ఆధారాలను కనుగొనలేకపోయారు. పైగా ఒంటె మూత్రం తాగడం ప్రమాదకరం అని వెల్లడించారు. ఇందులో బ్రూసెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండవచ్చన్నారు. ఇది ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇందులో యూరియా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని కలిగించవచ్చన్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అడుగు ముందుకు వేసి ఒంటె మూత్రాన్ని అస్సలు ఉపయోగించకూడదని హెచ్చరించింది. ఇది అస్సలు సురక్షితం కాదని, మంచి కంటే ఎక్కువ హాని కలిగించవచ్చని తేల్చి చెప్పింది.
ఇక మధ్యప్రాచ్యంలో చాలా మంది ఒంటె మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది అక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం అయ్యింది. అయితే జాగ్రత్తగా ఉండాలని సైన్స్ చెబుతుంది. ఒకవేళ ఎవరైనా ఒంటె మూత్రాన్ని వాడాలి అనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తుంది. ఆధునిక వైద్యంలో చాలా ఆరోగ్య సమస్యలకు సురక్షితమైన, మరింత నిరూపితమైన చికిత్సలు ఉండగా, ఒంటె మూత్రాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదంటుంది.
Read Also: ఆకాశం నుంచి పడ్డ బంగారు ఉల్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్!