దేశ వ్యాప్తంగా గణపతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్న గణనాథులు తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరారు. ముంబై గణపతి లాల్‌బాగ్చా రాజా నుంచి ఖైరతాబాద్ మహాగణపతి వరకు భక్తుల కోలాహలం నడుమ నీటిలోకి వెళ్లిపోయారు. నిమజ్జానికి ముందు నిర్వహించి లడ్డూ వేలం పాటలు ఈసారి కొత్త రికార్డులు నెలకొల్పాయి. పాత రికార్డులను బద్దలు కొడుతూ ఊహించని ధర పలికాయి.
⦿ రిచ్ మండ్ విల్లా, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్: రూ. 2.32 కోట్లు
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణపతి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. రాజేంద్రనగర్ లోని కీర్తి రిచ్ మండ్ విల్లాలో జరిగిన వేలం పాటలో 10 కిలోల గణేష్ లడ్డూ ఏకంగా రూ. 2.32 కోట్లు (రూ. 2,31,95,000) పలికింది.గత ఏడాది ఇక్కడి లడ్డూ రూ.1.87 కోట్లు పలకగా, ఈసారి రూ. 45 లక్షలు అధికంగా పలికింది. ఇక ఇక్కడ లడ్డూ వేలం పాట 2018 నుంచి కొనసాగుతోంది. 2018లో రూ. 25,000తో వేలం ప్రారంభమైంది. 2019లో రూ. 18.75 లక్షలు, 2020లో రూ. 27.3 లక్షలు, 2021లో రూ. 41 లక్షలు, 2022లో రూ. 60 లక్షలు, 2023లో రూ. 1.26 కోట్లు, 2024లో రూ. 1.87 కోట్లు. ఈ ఏడాది 2.32 కోట్లు పలికింది. దేశంలోనే అత్యంత ఎక్కువ ధర పలికిన లడ్డూగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ రాయదుర్గం, మైహోమ్ భుజా, హైదరాబాద్: రూ. 51 లక్షలు
అటు రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. గంటల పాటు కొనసాగిన ఈ వేలంలో చివరకు ఇల్లందు గణేష్ రూ. 51 లక్షలకు(రూ. 51,07,777) దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డు వేలం పాట రూ. 29 లక్షలు పలికింది. అప్పుడు కూడా ఇక్కడి లడ్డూను గణేషే సొంతం చేసుకున్నారు. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్ అయిన ఆయన, ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వ్యక్తి.
⦿ బాలాపూర్, హైదరాబాద్: రూ.35 లక్షలు
గణపతి లడ్డూ వేలం అనగానే గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ఈ ఏడాది గత రికార్డును బద్దలు కొడుతూ భారీ ధర పలికింది. బాలాపూర్ గణనాథుని లడ్డూ ఈసారి రూ.35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ధర మరోసారి రికార్డు సృష్టించింది. 38 మంది భక్తులు ఈ వేలంలో పాల్గొన్నగా చివరికి దశరథ్ దక్కించుకున్నారు. భక్తులు ఈ లడ్డూ సంపద, విజయం, ఐశ్వర్యం తెస్తుందని భావిస్తారు.
⦿ అయ్యలూరివారిపల్లి, ప్రకాశం జిల్లా, ఏపీ: రూ. 30 లక్షలు
ఈసారి ఏపీలో గణపతి లడ్డూ ధర రికార్డు ధర పలికింది. పలువురు ఈ వేలం పాటలో పాల్గొనగా.. పాలుగుళ్ల మోహన్ రెడ్డి రూ. 30 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అదే వేలంలో వినాయకుడి కలశంను రూ. 19.10 లక్షలకు ముత్యాల నారాయణరెడ్డి సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ బెంగళూరులో వ్యాపారస్తులుగా కొనసాగుతున్నారు.
Read Also: ఖైరతాబాద్ లడ్డును ఎందుకు వేలం వేయరు? నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!