New Bat Coronavirus: కోవిడ్ వైరస్‌ను ప్రపంచం అస్సలు మరిచిపోలేదు. అది సృష్టించిన విషాదం అంతా ఇంతా కాదు. అలాంటి వైరస్ మళ్లీ వస్తే? ఈ ఆలోచనే భయంగా ఉంది కదా. కానీ చైనాలో ఇప్పుడు మరో కొత్త వైరస్‌ను గుర్తించారు. అంటే ఇప్పటికే ఇది వ్యాప్తి చెందుతుందని కాదు. కానీ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు చైనా వైరాలజీ సైంటిస్టులు.
లెటెస్ట్‌గా చైనా సైంటిస్టులు గుర్తించిన వైరస్ కూడా గబ్బిలాల నుంచే ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా వైరస్‌ను కూడా గబ్బిలాల నుంచి వచ్చినట్టు అనేక స్టడీలు చెబుతున్నాయి. ఇప్పుడు చైనా సైంటిస్టులు కనిపెట్టిన వైరస్‌ను కూడా గబ్బిలాలలోనే గుర్తించారు.
ఇక కొత్తగా వచ్చిన వైరస్ కోవిడ్ మాదిరిగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన కొత్త వైరస్‌ను.. HKU-5- కోవ్-2గా పేర్కొన్నారు. కొవిడ్ 19కి కారణమైన.. SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు.. హాంకాంగ్‌కు చెందిన పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్‌గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి సారథ్యం వహించారు. ఇందులో గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు.
Also Read: వామ్మో ఇదేం ట్రెండ్.. యువకుడి ప్రాణాల మీదకి తెచ్చిన ఛాలెంజ్
ఈ వైరస్.. మెర్బెకో వైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్-కోవ్.. ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఇది హెచ్‌కేయూ5 కరోనా వైరస్ సంతతికి చెందినదిగా చెబుతున్నారు. వైరస్‌ను తొలుత హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం.. HKU5-CoV-2 నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాకపోతే కరోనా కంటే తక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్‌కు సంబంధించిన వివరాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు అందించింది చైనా. WHO కూడా ఇప్పుడు దీనిపై ఫోకస్ చేసింది.
ఈ వైరస్ లక్షణాలు చూస్తే.. కోవిడ్ మాదిరిగానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, నీరసంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి వ్యాక్సిన్లు, మందులు తయారు చేస్తున్నారు. అయితే కరోనా టైమ్‌లో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు అంతగా భయపడాల్సిన అవసరం లేదంటూ సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రస్తుతం గబ్బిళాలకు మాత్రమే సోకింది. ఫ్యూచర్‌లో మనుషులకు తొందరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని WHO అంచనా వేసింది.