Obesity: అధిక బరువు , ఊబకాయం అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేసే ప్రధాన ఆరోగ్య ముప్పుగా మారుతోంది.ఈ ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, బిజీ షెడ్యూల్‌లు, పరిమిత శారీరక శ్రమ ఊబకాయానికి దోహదపడే ప్రధాన కారకాలు అని పలు అధ్యయనాల్లో రుజువైంది. ఊబకాయం శరీర రూపాన్ని దెబ్బతీయడమే కాకుండా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా గణనీయంగా పెంచుతుంది.
జీవనశైలితో పాటు పలు కారణాలు బరువు పెరగడానికి ప్రాథమిక కారణాలు అయినప్పటికీ.. ముఖ్యమైన ప్రమాద కారకాలుగా ఉండే కొన్ని ఇతర పరిస్థితులు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాలు వాతావరణ మార్పు కూడా బరువు పెరగడానికి దోహదపడుతుందని సూచిస్తున్నాయి.
ఆహారంపై కార్బన్ డయాక్సైడ్ ప్రభావం:
డచ్ శాస్త్రవేత్తల ఇటీవలి పరిశోధనలో పెరుగుతున్న వాతావరణ కార్బన్ డయాక్సైడ్ (CO2) స్థాయిలు వరి, బార్లీ వంటి ముఖ్యమైన పంటలను ఎక్కువ కేలరీలు అధికంగా, తక్కువ పోషకాలుగా మారుస్తున్నాయని కనుగొన్నారు.
CO2 కిరణ జన్య సంయోగ క్రియను పెంచడం ద్వారా కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది. ఫలితంగా ఇది పంటలలో చక్కెర , స్టార్చ్ కంటెంట్‌ను పెంచుతుంది. ఇంకా.. ధాన్యాలలోని ప్రోటీన్ , పోషకాల మోతాదులను తగ్గిస్తుందని.. తినే ఆహారాన్ని అధిక కేలరీలు, తక్కువ పోషకాలుగా మారుస్తుందని పరిశోధనలో కనుగొన్నారు. ఇది నేరుగా బరువు పెరగడానికి దారితీస్తుంది.
పెరుగుతున్న ఊబకాయం సమస్యపై అధ్యయనం:
నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీ నిపుణుల బృందం ప్రసిద్ధ ఆహార మొక్కల “పోషక కంటెంట్‌లో విస్తృతమైన మార్పులు” గురించి హెచ్చరించింది. “ఆహార భద్రత తగినంతగా ఉన్నప్పటికీ.. ఈ మొక్కల పోషక భద్రత ప్రమాదంలో ఉంది” అని నిపుణులు తెలిపారు.
ఆహారం ఎక్కువ కేలరీలు, తక్కువ పోషకాలు కలిగి మారుతోంది. ఫలితంగా.. వాతావరణ మార్పు ఊబకాయం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధ్యయనంలో ఏం కనుగొన్నారు ?
ఆహారంపై వాతావరణ మార్పు ప్రభావం, దాని ఆరోగ్య సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ అర్థం చేసుకోవడానికి.. శాస్త్రవేత్తల బృందం వివిధ CO2 స్థాయిలలో పంటలను పండించిన నివేదికలను విశ్లేషించింది. దీంట్లో భాగంగానే వరి, బార్లీ, బంగాళదుంప, టమాటలో, గోధుమ, సోయాబీన్, వేరుశనగ వంటి మొత్తం 43 తినదగిన పంటలను అధ్యయనం చేశారు.
అధిక CO2 స్థాయిలు ఉన్న ప్రాంతాల్లో పండించిన పంటల పోషకాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని నిపుణులు కనుగొన్నారు. అటువంటి పంటలలో, జింక్,ఐరన్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలలో సాధారణంగా 4.4% వరకు తగ్గుదల కనిపించింది. అయితే కొన్నింటిలో 38% వరకు తగ్గుదల కనిపించింది.
Also Read: జాగింగ్‌తో ఈజీగా వెయిట్ లాస్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు
ఊబకాయం సమస్య :
ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు బియ్యం ప్రధాన ఆహారం అని, మిగిలిన వారు గోధుమలపై ఆధారపడి ఉంటారని బృందం హెచ్చరించింది. రెండింటిలోనూ ప్రోటీన్, జింక్ , ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి. ఇంకా.. ప్రతి నమూనాలోని కేలరీల కంటెంట్ పెరుగుతోంది. ఇది గతంలో కంటే ఊబకాయం స్థాయిలు పెరుగుతున్నాయని సూచిస్తుంది.