కరోనా మహమ్మారిని తట్టుకొని బయటపడ్డామనే ఆనందం ఎన్నో ఏళ్ళు నిలబడలేదు. మళ్లీ మనదేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పెరగడం ప్రారంభించింది. చాలా నెలల తర్వాత ప్రస్తుతం కోవిడ్ 19 యాక్టివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మన దేశంలో 5,300 కు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం 24 గంటల్లోనే సుమారు 500 కేసులు నమోదయ్యాయి. ఇలాగే జరిగితే కరోనా తిరిగి మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందిని తెలుస్తోంది.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లోని ప్రజలకు సోకుతోంది. కేరళలో పరిస్థితి దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కరోనా వైరస్ రోగులు ఆసుపత్రులలో చికిత్స పొందాల్సిన అవసరం వస్తుంది. అక్కడ కేసులు కూడా త్వరగా తిరుగుతున్నట్టు గుర్తించారు.
కరోనా లక్షణాలు
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ మూడు రకాల లక్షణాలను అధికంగా చూపిస్తోంది. ఇది మీకు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఇక్కడ చెప్పే లక్షణాలు అన్నీ కూడా సాధారణ జ్వరంలో కనిపించేవే. అందుకే ఎక్కువమంది పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.
వైద్యులు చెబుతున్న ప్రకారం కరోనా కొత్త వేరియంట్ పూర్తి ప్రాణాంతకం కాదు. కానీ మనుషుల్లో వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి అవసరం ఉంటే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్ళకండి. అలాగే ఎక్కువ మంది మనుషులు గుమిగూడిన చోట ఉండకండి. మాస్క్ కచ్చితంగా ధరించండి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
మీకు జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఉంటే కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించి మందులు వాడండి. ఎందుకంటే కరోనా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారిపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కాబట్టి సాధారణ జ్వరమేనని వదిలేయకుండా దగ్గు, ఒళ్ళు నొప్పులతో పాటు జ్వరం కూడా ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకుని తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. అలాగే ఇంట్లోని వారికి దూరంగా ఉండటం కూడా ముఖ్యం. లేకపోతే వారికి కరోనా వైరస్ ఒకే అవకాశం ఉంటుంది.
కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రయాణాలను తగ్గించుకోవడం ఉత్తమం. కరోనా వైరస్ పరిస్థితి ప్రస్తుతం అయితే అదుపులోనే ఉంది. కానీ కరోనా వేవ్ వన్, వేవ్ 2 సమయంలో వచ్చినంత తీవ్రంగా వస్తే మాత్రం ప్రజలకు పరిస్థితి కష్టంగా మారుతుంది. కాబట్టి తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించడం వంటివి చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లోని పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. వారి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. మీకు జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వంటివి ఉంటే వీలైనంతవరకు ఒక గదిలో ఐసోలేట్ అవ్వడానికి ప్రయత్నించండి.