Covid-19 Latest Update: కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొన్ని దేశాల్లో కోవిడ్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆసియా ఖండంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంలో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.
హాంకాంగ్ , సింగపూర్‌లో కోవిడ్-19 కేసులు ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది ఆసియాలో వైరస్ తిరిగి విజృంభిస్తున్న సంకేతాలను సూచిస్తోంది. ఈ రెండు నగరాలు అధిక జనసాంద్రత కలిగి ఉండటం వల్ల గత కొన్ని వారాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
హాంకాంగ్‌లో కమ్యూనికబుల్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆహు ప్రకారం.. వైరస్ వ్యాప్తి హాంకాంగ్ లో చాలా అధిక స్థాయిలో ఉంది. రెస్పిరేటరీ శాంపిల్స్‌లో కోవిడ్ పాజిటివ్ రేటు గత ఏడాది కాలంలో అత్యధిక స్థాయికి చేరుకుంది. మే 3కి ముందు మరణాల సంఖ్య 31కి చేరుకుంది. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికంగా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మురుగునీటిలో వైరస్ పెరుగుదల, బాధితుల సంఖ్య పెరగడంతో పాటు.. లక్షణాలతో స్థానికంగా ఉన్న ఆసుపత్రలకు వచ్చే వారి సంఖ్య వైరస్ వ్యాప్తిని సూచిస్తున్నాయి.
ఈ పెరుగుదలకు ఒక కారణం జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం కావచ్చు. ప్రస్తుత వేరియంట్‌లు గతం కంటే అంత ప్రమాదకరమైనది కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. ఒక్క వారంలోనే 14,200 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల గత కొన్ని వారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అధిక రిస్క్ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా వృద్ధులు , దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, బూస్టర్ షాట్‌లు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ పేపథ్యంలోనే సింగపూర్‌లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఇది వైరస్ వ్యాప్తిని కొంతవరకు నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఈ రెండు నగరాల్లో కోవిడ్‌తో పాటు అడినోవైరస్ , రైనోవైరస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలలో హాంకాంగ్‌లో 13 , 17 నెలల వయస్సు గల పిల్లల్లో ఈ వైరస్‌లను కనుగొన్నారు. ఇది తల్లిదండ్రులలో ఆందోళనను రేకెత్తిస్తోంది. మే 3న తొలి కేసు నమోదైనప్పటి నుండి.. ఒక వారంలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ప్రస్థుత పరిస్థితి గతంలో కోవిడ్‌ను సమర్థవంతంగా నియంత్రించిన ఈ నగరాలకు సవాలుగా మారింది. హాంకాంగ్ 2003 SARS అనుభవం నుండి కఠిన నియంత్రణ చర్యలను అమలు చేసింది. సింగపూర్ కూడా సామాజిక దూరం , వ్యాక్సినేషన్‌తో విజయం సాధించింది. కానీ ఇటీవలి కోవిడ్ పెరుగుదల వ్యాక్సినేషన్ రేట్లను మరింత పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కోవిడ్ టీకాలు వేయించుకోవాలని, మాస్క్‌లు ధరించాలని అంతే కాకుండా సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. ఈ పెరుగుదల ఆసియాలో కోవిడ్ ఇంకా అంతం కాలేదని, జాగ్రత్తలు అవసరమని గుర్తు చేస్తోంది.