Crispy kakarakaya vepudu recipe: కాకరకాయ అనగానే చాలా మంది చేదు భయంతో ముఖం తిప్పుకుంటారు. అయితే కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షుగర్‌తో బాధ పడేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి.. ఇది అద్భుతమైన ఆహారం. సరైన పద్ధతిలో వండితే.. అస్సలు చేదు లేకుండా, నోరూరించే రుచితో కరకరలాడే కాకరకాయ వేపుడును తయారు చేయెచ్చు. పిల్లలు సైతం ఇష్టంగా ఆరగించేలా ఈ స్పెషల్ కాకరకాయ ఫ్రైని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ చేదు పోవడానికి పాటించాల్సిన సింపుల్ చిట్కాలు:
1.కాకరకాయను వండే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దానిలోని చేదు చాలా వరకు మాయమైపోతుంది.
2.కాకరకాయలను సన్నని చక్రాలుగా లేదా ముక్కలుగా తరిగిన తర్వాత తగినంత ఉప్పు , చిటికెడు పసుపు వేసి బాగా కలిపి కనీసం 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత వాటిని గట్టిగా పిండితే.. చేదు నీరంతా బయటకు వచ్చేస్తుంది.
3.పిండిన ముక్కలను కొద్ది సేపు చింతపండు రసంలో లేదా పల్చని మజ్జిగలో నానబెట్టినా కూడా చేదు పూర్తిగా తగ్గిపోతుంది.
కావాల్సిన పదార్థాలు:
కాకరకాయలు: అర కిలో (సన్నని గుండ్రటి ముక్కలు)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3 (నిలువుగా చీల్చినవి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్
పసుపు: అర స్పూన్
కారం: 2 స్పూన్లు
ధనియాల పొడి: 1 స్పూన్
శనగపిండి లేదా బియ్యం పిండి: 2 స్పూన్లు (క్రిస్పీగా రావడానికి)
నూనె: వేయించడానికి సరి పడా
ఉప్పు, కరివేపాకు: తగినంత
తయారీ విధానం :
1. మొదటగా కాకరకాయలను శుభ్రంగా కడిగి, పైన ఉండే గరుకు భాగాన్ని కొద్దిగా చెక్కి సన్నని చక్రాలుగా తరకాలి. పైన చెప్పుకున్నట్లుగా ఉప్పు, పసుపు పట్టించి కాసేపు ఉంచిన తర్వాత చేదు నీరంతా పిండేయాలి.
2.ఇప్పుడు ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ముందుగా.. సిద్ధం చేసుకుని ఆరబెట్టిన కాకరకాయ ముక్కలను నూనెలో వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ముక్కలు క్రిస్పీగా మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
3.వేరొక కడాయిలో కేవలం 2 స్పూన్ల నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.
4. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కర కరలాడే కాకర కాయ ముక్కలను ఈ ఉల్లి పాయ పోపు మిశ్రమంలో కలపాలి. దీనికి తగినంత.. ఉప్పు, కారం, ధనియాల పొడి , ముక్కలు మరింత క్రిస్పీగా మారడానికి కొద్దిగా శనగ పిండి లేదా బియ్యం పిండి చల్లాలి. మంటను తక్కువగా ఉంచి మరో 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతే.. గుమగుమలాడే, అస్సలు చేదు లేని కర కరలాడే కాకర కాయ వేపుడు వడ్డించడానికి సిద్ధం!
ఈ కాకరకాయ వేపుడు వేడి వేడి అన్నంలోకి, సాంబార్ లేదా రసంతో తింటే.. అమృతంలా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీని మెప్పించండి!