Chanakya Niti practical thinking| మనసు చెప్పినట్లు నడుచుకోవడం మంచిదే.. కానీ ప్రతి సందర్భంలోనూ మనసు మాట వినడం సరైన నిర్ణయం కాదు. కొన్నిసార్లు కోపంతో మాట్లాడిన ఒక్క మాట ఎన్నో ఏళ్ల బంధాన్ని దూరం చేస్తుంది. మరికొన్నిసార్లు ఎదుటివారిపై గుడ్డిగా నమ్మకం ఉంచడం ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది. అందుకే జీవితంలో కొన్ని సందర్భాల్లో భావోద్వేగాల కంటే వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు బోధించాడు. కోపం, ప్రేమ, బాధ వంటి భావోద్వేగాలకు లోనుకాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
కొంతమంది కావాలనే ఇతరులను అవమానిస్తూ కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయంలో వెంటనే స్పందిస్తే సమస్య మరింత పెద్దదవుతుంది. ఎదుటివారు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కోపాన్ని అదుపులో ఉంచుకుని ఆలోచించి స్పందించాలి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో అప్పుడప్పుడు గొడవలు జరగడం సహజం. వారి మాటల వల్ల మనసు గాయపడుతుంది. ఎంతో బాధ కలుగుతుంది. అలాంటి సమయంలో కోపంతో బంధాన్ని తెంచుకోవాలని అనిపించవచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ముందుగా సమస్యకు కారణం తెలుసుకుని మాట్లాడుకోవాలి. తాత్కాలిక కోపం కోసం విలువైన బంధాలను దూరం చేసుకోకూడదు.
స్నేహితులు, బంధువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనిపించడం సహజం. అయితే మీ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. తిరిగి రాకపోతే సమస్యలు ఎదురవుతాయి. అలాగే అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మకూడదు. డబ్బు విషయంలో భావోద్వేగాల కంటే ఆలోచనకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎవరైనా అందరి ముందు అవమానిస్తే కోపం రావడం సహజం. వెంటనే తిరిగి సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ అలా చేయడం వల్ల చిన్న గొడవ పెద్ద సమస్యగా మారవచ్చు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే ప్రశాంతంగా స్పందించాలి. ప్రతి విమర్శకు గొడవతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సహనం, ఆత్మనియంత్రణ కూడా మన బలాలే.
Also Read: నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి
ఉద్యోగం మారడం, వ్యాపారం ప్రారంభించడం, వేరే నగరానికి వెళ్లడం వంటి నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు పైఅధికారితో గొడవ లేదా చిన్న నిరాశ కారణంగా వెంటనే ఉద్యోగం వదిలేయాలని అనిపించవచ్చు. కానీ అలాంటి నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.
Also Read: ఆఫీసులో ఎప్పుడూ మిమ్మల్ని విమర్శించే సహోద్యోగులు ఉన్నారా? మీ మానసిక ప్రశాంతతకు భగవద్గీత సూత్రాలు
భావోద్వేగాలు ప్రతి మనిషి జీవితంలో సహజం. అయితే వాటిని అదుపులో ఉంచుకోకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాణక్య నీతి బోధనలు సహనం, ఆత్మనియంత్రణ, వివేకంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితిని అర్థం చేసుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు ఆలోచించాలి.