Curd vs Buttermilk: మనం తినే ఆహారంలో పెరుగు, మజ్జిగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ.. వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, శరీరానికి అందించే ప్రభావాలలో తేడాలు ఉన్నాయి. కొంతమంది పెరుగును ఇష్టపడితే, మరికొంతమంది మజ్జిగను ఇష్టపడతారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకుందామా..
పెరుగు (Curd):
పెరుగు అనేది పాలను పులియబెట్టడం ద్వారా తయారవుతుంది. ఇది జీవక్రియలో సహాయపడే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్)ను కలిగి ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రోబయోటిక్స్: పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
కాల్షియం: పెరుగు కాల్షియానికి మంచి వనరు. ఇది ఎముకలు, పళ్లను బలంగా ఉంచుతుంది.
ప్రోటీన్: పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. శరీర కణాల మరమ్మత్తుకు కూడా సహాయ పడుతుంది.
శక్తి: పెరుగులో కేలరీలు, కొవ్వులు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.
బరువు పెరుగుదల: బరువు పెరగాలనుకునే వారికి లేదా పోషకాలు ఎక్కువగా అవసరమయ్యే వారికి పెరుగు మంచి ఎంపిక.
సైడ్ ఎఫెక్ట్స్ :
పెరుగు చలువను ఇస్తుంది. అందుకే కొంత మందికి అజీర్ణం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు, జలుబు వంటివి వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది,
మజ్జిగ (Buttermilk):
మజ్జిగ అనేది పెరుగును చిలికి, నీరు కలిపి, వెన్న తీసిన తర్వాత వచ్చే ద్రవం. దీనిలో పెరుగు కంటే తక్కువ కేలరీలు, కొవ్వులు ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియ: మజ్జిగ చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా, నీటి శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మసాలా ఆహారం తిన్న తర్వాత మజ్జిగ తాగితే జీర్ణం సులభం అవుతుంది.
శరీరానికి చలువ: వేసవి కాలంలో మజ్జిగ శరీరానికి చాలా చలువనిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయ పడుతుంది.
డీహైడ్రేషన్ నివారణ: వేసవిలో శరీరంలో ద్రవాలు కోల్పోయినప్పుడు మజ్జిగ తాగితే తక్షణ శక్తిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది.
బరువు తగ్గడం: మజ్జిగలో కేలరీలు , కొవ్వులు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక.
కడుపు సమస్యలు: అల్సర్, కడుపులో మంట వంటి సమస్యలు ఉన్నవారికి మజ్జిగ చాలా మేలు చేస్తుంది.
Also Read: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !
ఏది మంచిది ?
నిజానికి.. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే. అయితే ఏది మంచిది అనేది మీ శరీర అవసరాలు , తీసుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది.
రోజులు: వేసవి కాలంలో మజ్జిగ మంచిది. ఇది శరీరానికి చలువనిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా మజ్జిగను ఎంచుకోవచ్చు.
రాత్రిపూట: రాత్రిపూట మజ్జిగ తాగడం ఉత్తమం. ఎందుకంటే ఇది తేలికగా జీర్ణమవుతుంది.
బరువు పెరగాలనుకుంటే: పోషకాలు ఎక్కువగా కావాలనుకునేవారు, బరువు పెరగాలనుకునేవారు పెరుగును ఎంచుకోవచ్చు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు: జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా తేలికపాటి ఆహారం కావాలనుకునేవారు మజ్జిగను తాగడం మంచిది.
మొత్తంగా.. మితంగా తీసుకుంటే పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, సమయం, వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి వీటిని ఎంచుకోవాలి.
Also Read: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?