ఏ ప్రాంతమైనా.. ఏ దేశమైనా.. అత్తా కోడళ్ళ మధ్య గొడవలు సాధారణమే. కొన్నిసార్లు ఆ గొడవలు తారాస్థాయికి చేరుకొని ఒకరినొకరు చంపుకునే దాకా వస్తాయి. ఆస్ట్రేలియాలోని ఒక కోడలకు… భర్త కుటుంబం పై చాలా కోపం వచ్చింది. వారు లేకపోతే తన ప్రశాంతంగా జీవిస్తానని భావించింది. కానీ అందరికీ తెలిసేలా వారిని చంపడం ఇష్టం లేదు. అందుకే తెలివిగా ఇంటికి భోజనానికి పిలిచింది.
భర్తకు, అత్త మామకు, అత్త చెల్లికి విషపూరితమైన పుట్టగొడుగులను కూరగా వండింది. అవి తిన్న మామగారు, అత్తగారు, అత్తగారి చెల్లి కొన్ని గంటల్లోనే మరణించారు. మొదట్లో వారి మరణానికి కారణం తెలియలేదు. మధ్యాహ్నం తిన్న విందు రాత్రికి మరణానికి కారణమయ్యింది. అంటే ఈ పుట్టగొడుగులు కేవలం కొన్ని గంటల్లోనే మనిషి ప్రాణాన్ని తీసేశాయి. పోలీసుల దర్యాప్తులో వారికి ఏం జరిగిందో బయటపడింది.
ఎలాంటి పుట్టగొడుగులు?
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పుట్టగొడుగులలో డెత్ క్యాప్ పుట్టగొడుగులు కూడా ఒకటి. కోడలు తెలివిగా అత్తమామలకు వండిన ఆహారంలో ఈ పుట్టుగొడుగులను కూడా కలిపి వండింది. అడవికి వెళ్లి ప్రత్యేకంగా ఈ పుట్టగొడుగులను ఏరి మరీ తెచ్చింది. ఈ మష్రూమ్స్ గురించి ఇంటర్నెట్లో వెతికి మరీ సమాచారాన్ని సేకరించింది. ఇలాంటి పుట్టగొడుగులు చాలాచోట్ల పుడుతూ ఉంటాయి. కాబట్టి మనం తినే మష్రూమ్స్ మంచివా… కాదా ముందుగానే తెలుసుకోవాలి.
డెత్ క్యాప్ పుట్టగొడుగులు అంటే ఏమిటి?
ఇవి చిన్నగా ఉండే పుట్టగొడుగులు. కానీ చాలా ప్రమాదకరమైనవి. లేత పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. ముఖ్యంగా యూరోప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలోనే కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగుల్లో ఉండే విషం మన శరీరంలో చేరితే డిఎన్ఏ తయారీని ఆపివేస్తుంది. తర్వాత కాలేయం, మూత్రపిండాల వైఫల్యానికి కారణం అవుతుంది. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కనిపిస్తాయి. వీటిని తిన్న ఆరు నుండి 12 గంటల లోపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స అందకపోతే మరణం సంభవిస్తుంది.
కాబట్టి బయట దొరికే పుట్టగొడుగులు ఏవి పడితే అవి తినడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. కేవలం బటన్ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్, మోరల్స్, షిటేక్ మష్రూమ్స్, లయన్స్ మానె మష్రూమ్స్ వంటి రకాలను తినడం మంచిది. తెలియని పుట్టగొడుగుల జోలికి వెళ్ళకపోతేనే ఉత్తమం. ఎందుకంటే ఇవి కొన్ని చూసేందుకు అన్ని ఒకేలా ఉంటాయి. కానీ శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.