Blood group: బ్లడ్ గ్రూపును బట్టి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలను అంచనా వేయచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మన శరీరంలో రక్తం అనేది అతి ముఖ్యమైనది. అదే మన ఆరోగ్యాన్ని సగం నిర్ణయిస్తుంది. రక్తప్రసరణ సవ్యంగా జరిగితేనే ఏ అవయవమైనా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తే అది శరీరం అంతా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రక్తం ఎంతో ముఖ్యమైనది. దాని కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీకు ఏ బ్లడ్ గ్రూప్ రావాలన్నది జన్యుపరంగా నిర్ణయితమవుతుంది. బ్లడ్ గ్రూపును ఎవరూ ఎంపిక చేసుకోలేరు. తల్లిదండ్రులకు లేదా తాత అమ్మమ్మలకు, నానమ్మలకు చెందిన ఏ బ్లడ్ గ్రూప్ అయినా జన్యుపరంగా పుట్టే పిల్లలకు రావచ్చు. ఆ బ్లడ్ గ్రూపును బట్టి వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఆధారపడి ఉంటాయి.
ప్రధానంగా బ్లడ్ గ్రూపులు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. A, B, AB, O… ఇవే ప్రధానమైన బ్లడ్ గ్రూపులు. వీటిని బట్టే మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఆధారపడి ఉంటాయి.
గుండె జబ్బులు
AB రక్త వర్గం, B రక్త వర్గాలను కలిగి ఉన్న వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రావచ్చు. రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక రక్త వర్గం O ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీరు కలుషిత ప్రాంతాల్లో నివసించకూడదు. కాలుష్యం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇక AB, B రక్తం వర్గం ఉన్నవారు గుండె ఆరోగ్యాన్ని ముందుగానే కాపాడుకోవాలి. గుండెకు మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకొని తినాలి. ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో నెట్టేస్తాయి.
పొట్టలో అల్సర్లు
O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. కానీ వీరు పొట్టలో అల్సర్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి చర్మ సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే వస్తాయి. బ్లడ్ గ్రూప్ O తో పాటు బ్లడ్ గ్రూప్ A ఉన్నవారు కూడా పొట్ట క్యాన్సర్ల బారిన ప్రమాదం ఎక్కువే. మీరు తమ ఆహారంలో చేపలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తింటూ ఉండాలి. అలాగే ప్రతిరోజు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి.
దృష్టి సమస్యలు
దృష్టి లోపాలు, దృష్టి సమస్యలు వంటివి AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ప్రోటీన్ సమస్యలు వస్తే జ్ఞాపకశక్తిని కూడా వీరు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు కంటి చూపును కాపాడుకోవాలి.
రక్తం గడ్డ కట్టడం
బ్లడ్ గ్రూప్ A, B వారికి రక్తం గడ్డ కట్టడం అంశంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచేస్తాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒత్తిడి స్థాయిలు
మిగతా అన్ని బ్లడ్ గ్రూపులతో పోలిస్తే A బ్లడ్ గ్రూపు ఉన్నవారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వీరిలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి సవాలును విసురుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతి రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. అప్పుడే మీరు ఒత్తిడినే తట్టుకోగలరు.
Also Read: మీ గుండె బాగుండాలంటే.. ఈ కలర్ ఫుడ్స్ తినేయండి, ఈ రంగే ఎందుకంటే?
ఏ బ్లడ్ గ్రూపు వారైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, వ్యాయామం చేయడం ద్వారా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. చెడు జీవనశైలి అనేది ఎవరికైనా సమస్యలనే తెచ్చిపెడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. తాజా ఆహారానికి కొలెస్ట్రాల్ లేని ఆహారానికి పెద్దపీట వేయాలి. పండ్లు, కూరగాయలు, నీళ్లు అధికంగా తింటూ ఉండాలి.