బంగాళదుంపలను ఎక్కువ మొత్తంలోనే కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అలా చేస్తారు. అయితే కొన్ని బంగాళాదుంపలు వండకుండా అలా వదిలేస్తే మొలకెత్తుతాయి. మరికొన్ని ఆకుపచ్చగా కూడా ఉంటాయి. అలా మొలకెత్తినా లేక ఆకుపచ్చగా మారినా బంగాళదుంపలను తినడం ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మొలకెత్తిన బంగాళదుంపలు విషపూరితంగా మారుతాయి. అవి విషంతోనే సమానమని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. వాటిని పడేయాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని చెబుతున్నారు.
బంగాళాదుంపల్లో ఉండేవి ఇవే
మొలకెత్తిన బంగాళదుంపల్లో సోలనిన్, చాకోనైన్ అని రెండు గ్లైకో ఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కేవలం బంగాళదుంపల్లోనే కాదు, వంకాయలు, టమోటోలలో కూడా కనిపిస్తాయి. అయితే వీటిలో చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి. కానీ మొలకెత్తిన బంగాళదుంపల్లో మాత్రం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. ఎప్పుడైతే బంగాళదుంపలు మొలకెత్తడం ప్రారంభమవుతాయో … దానిలో ఆల్కలాయిడ్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. మొలకెత్తిన బంగాళదుంపల్లో ఉండే సోలనైన్ ఒక విషపూరిత సమ్మేళనం. దీన్ని అధిక మొత్తంలో తీసుకుంటే వికారం, వాంతులు, విరేచనాలు, నాడీ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే రక్తపోటు పడిపోవడం, పల్స్ వేగంగా మారడం, అధిక జ్వరం, తలనొప్పులు, గందరగోళం, చివరకు మరణం సంభవించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
బంగాళదుంప విషాన్ని తగ్గించడానికి లేదా తొలగించడానికి వీలుకాదు. కాబట్టి మొలకెత్తిన బంగాళదుంపలను బయటపడేయడమే. అలాగే దానిపైన ఆకుపచ్చ రంగు వస్తే ఆ ప్రాంతం అంతా కత్తితో కట్ చేసి బయటపడి మిగతా ముక్కను వండుకోవాలి.
బంగాళదుంపలను అధిక మొత్తంలో కొంటె వాటిని నిల్వ చేసే మార్గాలను తెలుసుకోండి. బంగాళదుంపలు త్వరగా చెడిపోకుండా ఉండాలంటే చల్లని, చీకటి ప్రదేశంలో భద్రపరచండి. అలాగే ఉల్లిపాయలతో కలిపి ఉంచకుండా వాటికి దూరంగా ఉంచండి. లేకపోతే ఉల్లిపాయల వల్ల బంగాళదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. అధిక ఉష్ణోగ్రతలకు బంగాళదుంపలు గురికాకుండా జాగ్రత్త పడింది.
Also Read: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్.. చైనా వైరస్ వచ్చేసింది, ఈ నగరానికి వెళ్తే జాగ్రత్త!